NTR Great Respect Towards women, in the ‘Karnataka Rajyotsava’ program
mictv telugu

ఎన్టీఆర్ సింప్లిసిటీకి కన్నడ అభిమానులు ఫిదా

November 2, 2022

జూనియర్ ఎన్టీఆర్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కన్నడ రాష్ట్రంలో కూడా అతనికి భారీ స్థాయిలో అభిమానులున్నారు. నిన్న (నవంబర్ 1)న ‘కర్ణాటక రాజ్యోత్సవ’ వేడుకలకు హాజరైన ఎన్టీఆర్ సింప్లిసిటీకి అక్కడి కన్నడ అభిమానులు ఫిదా అయిపోయారు. వర్షం పడి కుర్చీలు తడిసిపోతే స్వయంగా వాటిని తుడిచి దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ భార్య అశ్వినిని, ఇన్ఫోసిస్ చైర్మన్ సుధా మూర్తిని కూర్చోబెట్టి మహిళల పట్ల తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. ఆ తర్వాత తన కుర్చీని కూడా తుడుచుకుని కూర్చున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మంగళవారం కర్ణాటక అసెంబ్లీలో నిర్వహించిన కన్నడ రాజ్యోత్సవ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్, రజనీకాంత్ గెస్టులుగా వెళ్లారు. అయితే ఆ వేడుకలో పునీత్ రాజ్ కుమార్ గురించి మాట్లాడిన ఎన్టీఆర్ అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ వేడుక ప్రారంభం అయ్యేలోపే అప్పటికే వర్షం మొదలయ్యింది. అయినప్పటికీ కూడా వేడుకను అలాగే నిర్వహించారు. వర్షాన్ని లెక్కచేయకుండా ఎన్టీఆర్ కూడా తన మాటలను అలాగే కొనసాగించారు. తాను పునీత్ రాజ్ కుమార్ స్నేహితుడిని అయినందుకు చాలా గర్వపడుతున్నానని, అలాగే ఇంతమంది అభిమానులను సంపాదించుకున్న పునీత్ నిజంగా గొప్ప రాజు అని తారక్ వివరణ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కన్నడలో చేసిన ప్రసంగం అభిమానులతో కేరింతలు కొట్టించింది.

ఈ క్రమంలోనే అతిథుల కోసం ఏర్పాటు చేసిన కుర్చీలు తడిసిపోయాయి. అది గమనించిన ఎన్టీఆర్ ఓ కుర్చీని బట్టతో తుడిచి పునీత్ రాజ్‌కుమార్ భార్య అశ్వినిని కూర్చోబెట్టారు. ఆ తర్వాత మరో కుర్చీలో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్ పర్సన్ సుధామూర్తిని కూర్చోమని చెప్పారు. అనంతరం తన కుర్చీని కూడా తానే క్లీన్ చేసుకుని కూర్చున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను చూసి తారక్ కన్నడ అభిమానులతోపాటు నెటిజన్లు కూడా ఎన్టీఆర్ సింప్లిసీటిని చూసి కొనియాడుతున్నారు. కాగా, పునీత్ రాజ్‌కుమార్‌కు కర్ణాటక ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ‘కర్ణాటక రత్న’ పురస్కారాన్ని నిన్న ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, రజనీకాంత్, ఎన్టీఆర్‌లు పునీత్ భార్య అశ్వినికి అందజేశారు.