తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన నటసార్వభౌముడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, నందమూరి తారక రామారావుకు అరుదైన గౌరవం దక్కనుంది. రూ.100 నాణెంపై ఎన్టీఆర్ బొమ్మను ముద్రించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు అధికారులు సమాచారం అందించారు. బీజేపీ నేత, ఎన్టీఆర్ కుమార్తెను మింట్ అధికారులు కలిసి ఎన్టీఆర్ బొమ్మ ఉన్న రూ.100 నాణెం నమూనాను చూపించారు. ఆమె నుంచి మరికొన్ని సలహాలు, సూచనలు కోరారు. అయితే ఆమె అధికారులు చూపించిన నాణెంకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో త్వరలోనే రూ.100 నాణెం మార్కెట్లోకి విడుదలకాబోతుంది.
చిత్ర, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ చేసిన సేవలకు గుర్తుగా కేంద్ర ప్రభుత్వం ఈ కాయిన్‌ను ముద్రిస్తుంది. ఎన్టీఆర్ శత జయంతోత్సవాలు జరుగుతున్న సమయంలోనే రూ.100 నాణెంపై ఎన్టీఆర్ బొమ్మ ప్రకటన రావడంపై తెలుగు ప్రజలు, టీడీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఎన్టీఆర్‌కి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ ఎప్పటినుంచో గట్టిగా వినిపిస్తోంది. అయితే భారతరత్న కాకుండా రూ.100 నాణెంను అందుబాటులోకి తీసుకువస్తోంది కేంద్రం. ఈ విషయంలో కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ లీడర్ పురంధేశ్వరి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఎన్టీఆర్ బొమ్మను వంద రూపాయల నాణెంపై ముద్రించేందుకు ఆర్బీఐ గవర్నర్ సుముఖత వ్యక్తం చేసినట్లు గతేడాది జూన్‌లోనే కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి తెలిపారు.