జీవితాలు నిలబెడుతున్నవారి జీతాలు పెంచరా ! - MicTv.in - Telugu News
mictv telugu

జీవితాలు నిలబెడుతున్నవారి జీతాలు పెంచరా !

July 25, 2017

దవాఖానా అంటే డాక్టరే గుర్తుకొస్తాడు. నర్సు మాత్రం చాలా తక్కువ మందికి గుర్తుకొస్తుంది. ఆసుపత్రికొచ్చే రోగులకు అమ్మవుతుంది నర్సు. వారిని కంటికి రెప్పలా కాపాడే వైద్యదేవత అవుతుంది నర్సు. దవాఖానాలో నర్సులు చేసే సేవలు ఎన్నో.., అలాంటి నర్సులకు నెలవారీ వేతనాన్ని ప్రభుత్వం పెంచడంలో న్యాయం వుంది. కేరళా ప్రభుత్వం నర్సుల జీతాలను రూ. 20,000 లకు పెంచారు. అలాగే ఇక్కడ మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నర్సుల జీతాలను రూ. 20,000 లకు పెంచాలని నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా ప్రైవేట్ వైద్యశాలల్లో పనిచేసే నర్సుల జీతాలపై నిపుణులతో అధ్యయనం చేయించిందని నర్సింగ్ అసోసియేషన్ కన్వీనర్ లక్ష్మణ్ రుదావత్ ఒక ప్రకటనలో తెలిపారు. తర్వాత వెంటనే స్పందించిన కేంద్ర ప్రభుత్వం అన్నీ రాష్ర్ట ప్రభుత్వాలకు నిపుణుల కమిటీ ఆదేశాలను అమలు చెయ్యాల్సిందిగా ఆజ్ఞాపించిందన్నారు. కేరళా రాష్ర్టంలో అక్కడి నర్సులు ఈ విషయమై పెద్ద ఎత్తున ఉద్యమించి రాష్ట్ర ప్రభుత్వంతో ఆమోదాన్ని పొందినట్టే ఇక్కడ కూడా అమలు చెయ్యలంటున్నారు.

నిజమే నర్సుల జీతాలు పెంచడంలో న్యాయం వుంది. ఎందుకంటే డాక్టర్ సూచనల ప్రకారం నర్సు రోగుల వెంట ఎంత శ్రమించాలి ? అనారోగ్యులను అక్కున చేర్చుకొని వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఇంటికి వెళ్ళేసరికి వారికి ఎన్ని సేవలు చెయ్యాలి ? వృత్తిధర్మాన్ని దైవంలా భావించి ప్రేమ తత్వంతో చేసుకుపోయే నర్సుల వేతనాలు ప్రస్తుతం తక్కువే. చాలీచాలని జీతాల కారణంగా చాలా మంది నర్సుల జీవితాలు చాలా అధ్వన్నంగా వుంటున్నాయి ? డాక్టర్లకు లక్షల్లో వుంటాయి జీతాలు కానీ నర్సుల వరకొచ్చేసరికి జీతాలు చాలా తక్కువగా వుంటాయి. నర్సులేని దవాఖానా తోరణం లేని గుమ్మంలాంటిది. డాక్టర్ రోగాన్ని గుర్తించి దానికి తగ్గట్టు మందులు రాసిచ్చి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఆ పేషెంటు బాధ్యత మొత్తం నర్సుదే వుంటుంది. ఆ రోగిని తన కన్న బిడ్డలా చూస్కుంటూ వారికి సకాలంలో సరైన టైంకు మందులు ఇచ్చి, వారు పాస్ పోసినా, విరేచనాలు చేస్కున్నా ఛీ అనకుండా వారిని శుభ్రంగా తుడిచి సేవలు చేస్తుంది నర్సు. రోగి జబ్బు నయం అయ్యేవరకు వాళ్ళను సొంత బిడ్డలా చూస్కుంటూ, రాత్రింబవళ్ళు సేవలు చేసే నర్సులకు జీతాలు పెంచడం అనే విషయంలో తెలంగాణ సర్కార్ సానుకూలంగా స్పందిస్తుందని రాష్ర్ట నర్సింగ్ అసోసియేషన్ తమ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తోంది.