ఐసీయూలో కోమాలో ఉన్న పేషెంటు ముందు నర్సులు డ్యాన్స్ చేసిన సంఘటన కరీంనగర్లో చోటుచేసుకుంది. ఆస్పత్రి వర్గాలు తెలిపిన వివరాలు ప్రకారం.. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గొల్లపల్లికి చెందిన శ్రీనివాస్ కాలేయం సంబంధ వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు కరీంనగర్లోని మీనాక్షి ఆస్పత్రిలో చేర్పించారు. డాక్టర్లు మెరుగైన చికిత్సనందించడంతో ప్రాణాపాయం తప్పింది కానీ, పెషెంట్ కోమాలోకి వెళ్లిపోయాడు. కొన్ని ప్రయత్నాలు చేసినా, ఫలించకపోవడంతో చివరకు డాక్టర్ల సూచన మేరకు నర్సులు పేషెంట్ దగ్గర సినిమా పాటలు వేసి డ్యాన్స్ చేశారు. అదృష్టవశాత్తూ వీరి ప్రయత్నం ఫలించి శ్రీనివాస్లో కదలిక ప్రారంభమై, చేతులు ఊపడం మొదలుపెట్టాడు. దీంతో సంబరపడిన డాక్టర్లు పేషెంటుని ఐసీయూ నుంచి షిఫ్ట్ చేసి జనరల్ వార్డుకు తరలించి తదుపరి చికిత్సనందిస్తున్నారు. కాగా, నర్సులు డ్యాన్స్ చేసిన వీడియో బయటకు రావడంతో వారి ప్రయత్నాన్ని పలువురు అభినందిస్తున్నారు.