డాక్టర్లు దేవుళ్ళు మరి నర్సులు ? - MicTv.in - Telugu News
mictv telugu

డాక్టర్లు దేవుళ్ళు మరి నర్సులు ?

July 7, 2017

దరిదాపు సమాజంలోని అన్నీ వ్యవస్థలు మీద సినిమాలు వచ్చాయి. కానీ నర్సింగ్ వ్యవస్థ మీద ఇంత వరకు పూర్తి స్థాయిలో ఒక్క సినిమా కూడా రాలేదు. ఒక్కొక్క హాస్పిటల్లో డాక్టర్ల కన్నా ఎక్కువ నర్సులే రోగులకు రాత్రింబవళ్ళు సేవలు చేస్తుంటారు. కానీ వాళ్ళ మీద చాలా కాలం నుండి చిన్న చూపు వుంది. వాళ్ళ వృత్తి మీద చాలా మందికి అస్సలు గౌరవం లేకుండా పోతోంది. నర్సుల మీద సినిమాల్లో, వివిధ ప్రోగ్రాముల్లో సెటైర్లు వేయటంతో నర్సింగ్ వ్యవస్థ చాలా అవమానాలను సహించవలసి వచ్చింది.
ఈ మధ్య ఈటీవీ జబర్దస్త్ ప్రోగ్రాంలో నర్సుల మీద చాలా నీచంగా పంచులు వేయటంతో నర్సింగ్ సంఘాలు ఆక్రోషంగా ఆ పోగ్రాంను బ్యాన్ చెయ్యాలని పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన విషయం తెల్సిందే. నర్సులు వాళ్ళ జీవన విధానం పూర్తిగా సామాజిక సేవా తత్పరతతో వుంటుంది. అలాంటివారి గురించి తప్పుగా ప్రచారం చెయ్యటం అనేది నిజంగా దురదృష్టకరం. ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు నర్సింగ్ వ్యవస్థ మీద పూర్తి స్థాయి సినిమా రాబోతోంది. నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ వారి సహకారంతో ఈ సినిమా నిర్మణం

కానుంది.

ఇందులో ముఖ్యంగా నర్సుల దైనందిన జీవన విధానం, వారి సేవా నిరతి, సమాజం నుండి వారు ఎదుర్కుంటున్న ఛీత్కారాలు, అవమానాలను ఈ సినిమాలో చర్చించనున్నారట. ప్రస్తుతం చిత్రం యొక్క స్క్రిప్టు పనులు జరుగుతున్నాయని నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ కన్వీనర్ లక్ష్మణ్ రుదావత్ ఒక ప్రకటనలో తెలిపారు. అన్నీ చెప్పుకున్నాం గానీ ఈ సినిమాకు దర్శకుడెవరో చెప్పుకోలేదు కదూ. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు గ్రహీత డాక్టర్ పి.సి. ఆదిత్య దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమానైనా నర్సింగ్ వ్యవస్థ యొక్క గౌరవాన్ని నిలబెట్టి వారికి సమాజంలో సముచిత స్థానం వుండకపోయినా పర్వాలేదు గానీ తోటి సమాజం వాళ్ళనూ, వాళ్ళ సేవలను గుర్తిస్తే చాలు.