ఇంగ్లాండ్ టీమ్ గత కొంతకాలంగా ‘బజ్‌బాల్’ ప్లాన్‌తో అదరగొడుతుంది. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్‌లో దూకుడుగా ఆడుతూ అద్భుతమైన ఫలితాలను సాధిస్తోంది. పెద్దపెద్ద టార్గెట్లను చేధించడమే కాకుండా..మొదట ఇన్నింగ్స్ ల్లోనూ టీ20, వన్డే తరహాలో ఆడుతూ భారీగా పరుగులు రాబట్టి ప్రత్యర్థులను ఆత్మరక్షణలోకి నెట్టేస్తోంది. తాజాగా న్యూజిలాండ్‌తో బే ఓవల్ వేదికగా మొదటి టెస్ట్‌లో బజ్‌బాల్ వ్యూహాన్ని అమలు చేసి ఫలితాన్ని రాబట్టారు ఇంగ్లాండ్ ఆటగాళ్లు.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ టీమ్ 58.2 ఓవర్లలోనే 325/9తో ఇన్నింగ్స్‌ని డిక్లేర్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. వన్డే తరహాలో బ్యాటింగ్ చేసి ఒక్కరోజులోనే భారీ స్కోర్ సాధించారు. అయితే ఇంకా వికెట్ మిగిలి ఉండి మరిన్ని పరుగులు చేసే అవకాశం ఉన్నా ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ను డిక్లేర్డ్ చేసింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో డకెట్ 84 , హ్యారీ బ్రూక్ 89 పరుగులతో రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో వాగ్నర్ నాలుగు, టిమ్ సౌథీ, కుజ్లీజిన్ చెరో రెండు, టిక్నర్ ఒక వికెట్ పడగొట్టాడు. ఆ తర్వాత మొదటి ఇన్నింగ్స్ ఆడిన న్యూజిలాండ్ గురువారం ఆట ముగిసే సమయానికి 37 పరుగులు చేసి 3 వికెట్లో కోల్పోయింది. దీంతో ఇంగ్లాండ్ ప్లాన్ వర్కౌట్ అయ్యింది.న్యూజిలాండ్ ఇంకా 288 పరుగులు తొలి ఇన్నింగ్స్‌లో వెనుకబడి ఉంది.