భరత్ రెడ్డి సమర్పించు “దళితులపై దాడి చేస్తాం” విజయవంతం - MicTv.in - Telugu News
mictv telugu

భరత్ రెడ్డి సమర్పించు “దళితులపై దాడి చేస్తాం” విజయవంతం

December 1, 2017

అనుమానించిందే అయింది. నిజామాబాద్ జిల్లా అభంగపట్టణంలో దళితులపై బరితెగించిన అమానుషం కొత్త వేషం కట్టింది. లెదర్ బలిసిన భరత్ రెడ్డి అనే ఇసుక దొంగకు సపోర్ట్ గా సినిమా కథ షుర్వు అయింది. తప్పు చేసినవని నిలదీసిన లక్ష్మణ్, రాజేశ్ అనే దళితులను మురికి గుంటల ముంచి, రాక్షసానందం పొందిన భరత్ రెడ్డిని సేఫ్ గ తప్పించే స్కెచ్ సక్సెస్ ఫుల్ గా అమలవుతుంది.

                ఇసుక రవాణాపై ప్రశ్నించిన లక్ష్మణ్, రాజేశ్ అనే దళితులను భరత్ రెడ్డి బెదిరించి, మురికి గుంటల  ముంచిన వీడియో పోయిన నెల 12న బయటకు వచ్చింది. మనిషన్న ప్రతీ వాడి రక్తం మరిగింది. భరత్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటూ దళిత సంఘాలు ఛలో అభంగపట్టణం చేసినయ్. అప్పటిదాకా పుర్ సత్ గ ఉన్న పోలీసులు కదిలిన్రు. రెండు మూడు టీంలను పెట్టి భరత్ రెడ్డి కోసం వెతుకుడు మొదలుపెట్టిన్రు. ఓ దిక్కు అది నడుస్తుంటే ఇంకో దిక్కు బాధితులు గాయబ్ అయిన్రు.  భరత్ రెడ్డే కిడ్నాప్ చేసిండని కుటుంబసభ్యులు ఆరోపించిన్రు.

పోలీసింగ్ లో ఇండియాల్నే వరల్డ్ ఫేమస్ అయిన తెలంగాణ పోలీసులు భరత్ రెడ్డి నీడను కూడా కనిపెట్టలేకపోయిన్రు. తమ వాళ్లు బతికి ఉన్నరా లేదా అన్న బాధిత కుటుంబ సభ్యుల ప్రశ్నలకు  కూడా జవాబు చెప్పలేకపోయిన్రు. తమవాళ్లు  క్షేమంగ రావాలని వాళ్లు ఎక్కని గడప లేదు. మొక్కని పోలీసు లేడు. ఇయ్యాల వాళ్లు నిజామాబాద్ ఎంపీ కవితను కలిసిన్రు. తమ బాధ చెప్పుకున్నరు. ఏం కాదు? నేను చూస్కుంట అని కవిత ఇట్ల అన్నదో లేదో లక్ష్మణ్, రాజేశ్ హైదరాబాద్ పోలీసుల అదుపులోకి వచ్చిన్రు. అయితే బాధితుల రూపంలో కాదు సినిమా యాక్టర్ల రూపంలో….  

                దొరల రాజ్యం అనే సినిమా కోసమే తాము భరత్ రెడ్డి తో నటించినమని లక్ష్మణ్, రాజేశ్ లు పోలీసులతో చెప్పినట్టు వార్తలొస్తున్నయ్. సినిమా షూటింగ్ కోసమే మురికి గుంటల మునిగినమన్నరు. అయితే లక్ష్మణ్, రాజేశ్ లు సినిమా కథ చెప్పడం వెనుక కుట్ర ఉందంటున్నయ్ దళిత సంఘాలు. కిడ్నాప్ చేసి భయపెట్టి వాళ్లతో అలా చెప్పిస్తున్నరని విమర్శిస్తున్నయ్. దీంట్లో పోలీసుల హ్యాండ్ కూడా ఉందని ఆరోపిస్తున్నయ్. ముందు భరత్ రెడ్డిని అరెస్ట్ చేసి నిజానిజాలను కక్కించాలని డిమాండ్ చేస్తున్నయ్.