స్వర్గీయ టిక్కుకు నెలమాసికం.. ఇంద్రుడా ప్లీజ్ అనుమతివ్వు!   - MicTv.in - Telugu News
mictv telugu

స్వర్గీయ టిక్కుకు నెలమాసికం.. ఇంద్రుడా ప్లీజ్ అనుమతివ్వు!  

May 17, 2019

మనిషి కూడా ఒక జంతువే. ‘హోమో సేపియన్స్ సేపియన్స్’ అని ఏదో శాస్త్రీయనామం ఉంది, క్షీరదం అని ఇంకేదో వర్గీకరణ కూడా ఉంది. మానవజాతి ఈ సృష్టిలోని కోటానుకోట్ల జీవజాతుల్లో ఒకటి మాత్రమే. కానీ అది మిగతా జీవుల్లా ఊరుకోదు. పకడ్బందీ భావవ్యక్తీకరణ దాన్ని మిగతా జీవులనుంచి వేరు చేసి తిరుగులేని ఆధిపత్యాన్ని కట్టబెట్టింది.

మనిషి భావోద్వేగాల్లోనూ మిగతా ప్రాణులపై పైచేయి సాధించాడు. కష్టమొస్తే విలపించడం, సుఖానికి పొంగిపోవడం, కోపమొస్తే రెచ్చిపోవడం, దాడి చేయడం రివాజు. ప్రేమ కలిగితే ప్రేమించడం కూడా. అతని/ఆమె ప్రేమకు అంతు ఉండదు. ఆ ప్రేమకు ఏ అంతరాలూ అడ్డురావు.  ప్రేమ అంటే కేవలం స్ర్త్రీపురుషుల మధ్య ప్రేమే కాదు. తల్లిబిడ్డల మధ్య, తోబుట్టువుల మధ్య, స్నేహితుల మధ్య ఉన్న అనురాగం, అనుబంధం కూడా ప్రేమే. ప్రేమకు చివరికి జాతిభేదం కూడా అడ్డుకాదు. మనుషులను జంతువులు, జంతువులు మనుషులను ప్రేమించడం చూస్తుంటాం. ముఖ్యంగా మనిషికి కుక్కతో ఉన్న సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మానవ సమాజం కాస్త తెలివి నేర్చినప్పటి నుంచి అది  వెన్నంటే ఉంది. విశ్వాసంలో దాన్ని మించిన జీవి మరొకటి లేదు. అందుకే కుక్కపై లెక్కలేనని కథలు ఉన్నాయి. కాలభైరవం అని పూజిస్తాం. భయపడతాం. మహాభారతంలోని మహాప్రస్థానిక పర్వంలో గుండెల్ని పిండేసే కుక్క కథ ఉంది. పాండవులు సర్వసంగపరిత్యాగులై మహాప్రస్థానానికి వెళ్లే ఘట్టం లోనిది అది. ధర్మారాజు వెంట బయల్దేరిన పరివారం దారిలో ఒక్కొక్కరుగా చనిపోతారు. చివరకు ఓ కుక్కమాత్రమే అతన్ని వెన్నంటి ఉంటుంది. ధర్మరాజుకు ఇంద్రుడు ఎదురై తన వెంటరమ్మంటాడు. తనతోపాటు తనను నమ్ముకుని వస్తున్న కుక్కతోపాటు తీసుకెళ్లమంటాడు పాండవాగ్రజుడు. దీంతో ఇంద్రుడు ‘ధర్మనందనా.. కుక్కకు స్వర్గలోక ప్రాప్తి లేదు..’ అని తేల్చేస్తాడు.

ఆ కథను అలా వదిలి ఇక విషయంలోకి వస్తే.. నిజామాబాద్ జిల్లా ముప్కాల్‌లోని చంద్రశేఖర్ కాలనీలో గత నెల 17వరకు.. అంటే కచ్చితంగా నెలకిందటి వరకు టిక్కు అనే ఒక నమ్మినబంటు ఉండేది. 14 సంవత్సరాలు బతికి ఆ రోజు కాలం చేసింది. రిటైర్డ్ డీపీఓ గద్దల సంజీవ్ దాని యజమాని. టిక్కూ మరణంతో ఆయన కుటుంబం కుదేలైంది. కుటుంబంలో ఒకరిగా కలసిమెలసి, వారికి అండగా నిలిచిన ఆ శునకరాజాన్ని నిజంగా కుటుంబసభ్యురాలిగానే భావించారు. అందుకే దానికి నెల మాసికం చేస్తున్నారు. పైకి ఇదేదో తమాషా వ్యవహారంగా కనిపించినా అందులో, అంతులేని దు:ఖం ఉంది, ఈ మూగజీవి ఇక తిరిగిరాదన్న కఠోర సత్యం ఉంది. ఆ కుక్క ఈ లోకాన్ని విడిచివెళ్లినా దాని ఆత్మకు శాంతి కలగాలనే తపన ఉంది.

కుక్కలో, పిల్లులో మనమధ్య ఉంటే వాటికి ఇంత తిండిపెడతాం. కానీ, టిక్కూ ఈ లోకంలో లేదు. దొంగలకు తప్ప ఎవరికీ ఏ హానీ చేయని టిక్కూ కచ్చితంగా స్వర్గానికే వెళ్లి ఉంటుందని ఒక నమ్మకం. కుక్కకు స్వర్గంలో స్థానం లేదని ఇంద్రుడు భీష్మించినా సరే. అందుకే దాన్ని ఒట్టి టిక్కూ అని  అనకుండా స్వర్గీయ టిక్కూ అని నెలమాసికంగా సందర్భంగా పత్రికల్లో ఇచ్చిన ప్రకటనలో పేర్కొన్నారు. పెద్దకర్మ గత నెల 24న నిర్వహించారని కూడా వివరించారు. ‘జీవితం ఒక నాటకరంగం’ అని కవులు అంటారు. అవును. మనం కేవలం పాత్రధారులం మాత్రమే. టిక్కూ కూడా అలాంటిదే. దాని పాత్ర ముగించేసి అది వెళ్లిపోయింది. టిక్కూ ఆత్మకు శాంతి కలగాలని మనం కూడా కోరుకుందాం..!