‘అర్జున్ రెడ్డి’ ఇంటికి రావడం కష్టమే! - MicTv.in - Telugu News
mictv telugu

‘అర్జున్ రెడ్డి’ ఇంటికి రావడం కష్టమే!

September 5, 2017

సంచలన చిత్రం ‘అర్జున్ రెడ్డి’ ముందు మరో పెద్ద ఆటంకం నిలిచింది. దేశవిదేశాల్లో ఘన విజయం సాధించిన ఈ మూవీ శాటిలైట్ ప్రసార హక్కుల అమ్మకానికి చిక్కొచ్చి పడింది. థియేటర్లలో డబ్బులు రాలుస్తున్న ఈ సినిమా హక్కులు నిజానికి ఇప్పటికే అమ్ముడైపోవాల్సి ఉంది. అయితే ఘాటు రొమాన్సు, ఇతర వివాదాస్పద అంశాలతో తీసిన సినిమాకు దక్కిన ‘ఏ’ సర్టిఫికెట్ దీనికి పెద్ద అవాంతరంగా నిలిచింది. మామూలుగా అయితే ఏ సర్టిఫికెట్ సినిమాలను టీవీల్లో ప్రదర్శించడానికి అనుమతించరు. అలా ప్రదర్శించాలంటే అభ్యంతరకర సన్నివేశాలను తొలగించి మళ్లీ  యూ/ఏ సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే లిప్ లాక్.. ఏం మాట్లాడుతున్నావ్ రా..(బూతు పదం) వంటి డైలాగులు, సన్నివేశాలు తొలగించి ప్రదర్శిస్తే సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుందనేది సందేహాస్పదం.

అభ్యంతర సన్నివేశాలను తొలగించే అవకాశం లేదని తాజాగా వస్తున్న నిడివి పెంపు వార్తలు చెబుతున్నాయి. ఎడిటింగ్ లో కత్తిరించిన 40 నిమిషాల ఫుటేజీని తిరిగి కలిపి 3 గంటల 40 నిమిషాల నిడివితో  ప్రదర్శించాలని సినిమా టీం యోచిస్తోంది. ఒకవేళ టీవీ కోసం సెన్సార్ చేస్తే ప్రస్తుతమున్న 3 గంటల నిడివి అరగంటకు తగ్గే అవకాశం ఉంటుంది. అదేచేస్తే కనుక సినిమా థియేటర్లలో చూసిన 3 గంటల 40 నిమిషాల మూవీకి, టీవీలో వచ్చే రెండున్నర గంటల మూవీకి చాలా తేడా ఉంటుంది. జనాన్ని పెద్దగా ఆకట్టుకోకపోవచ్చు.