శ్మశానంలో క్షుద్రపూజలు.. నలుగురు యువకులు అరెస్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

శ్మశానంలో క్షుద్రపూజలు.. నలుగురు యువకులు అరెస్ట్

October 2, 2020

సాంకేతికంగా, వైజ్ఞానికంగా సమాజం ఎంత ముందుకు పోతున్నా ఇంకా మూఢనమ్మకాలను పట్టుకుని వేళాడేవారు ఇంకా ఉంటున్నారు. ఆ మూఢ నమ్మకాలను ఫాలో అవడానికి టెక్నాలజీని కూడా వాడుకుంటున్నారు. ఆన్‌లైన్‌లో క్లాసులు నేర్చుకున్నట్లే.. నలుగురు యువకులు ఆన్‌లైన్‌లో క్షుద్రపూజలు నేర్చుకోవడం ప్రారంభించారు. అయితే వారి మంత్రాలు తిరగదోడటంతో అడ్డంగా దొరికిపోయారు. నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. గోవిందపురం గ్రామానికి చెందిన నలుగురు యువకులకు క్షుద్రపూజలు నేర్చుకోవాలని దుర్బుద్ధి పుట్టింది. అర్ధరాత్రి శ్మశానానికి వెళ్లి ఏవేవో మంత్రాలు చదవసాగారు. ఫోన్‌లో ఎవరో మంత్రాలు చదువుతుంటే వీరు కూడా వాటిని పఠించసాగారు. 

ఆ సమయంలో అటుగా వెళ్తున్న కొందరు గ్రామస్తులు శ్మశానంలో యువకులును చూసి షాక్ అయ్యారు. రాత్రివేళ వాళ్లు శ్మశానంలో ఏం చేస్తున్నారని దగ్గరకు వెళ్లి చూశారు. క్షుద్రపూజలు చేస్తున్నారని గ్రహించి వారు మరింత షాక్ అయ్యారు. వెంటనే స్థానికులకు ఫోన్‌లో సమాచారం అందించారు. దీంతో మరికొందరు గ్రామస్తులు అక్కడికి వచ్చారు. ఇక్కడ ఏం చేస్తున్నారని యువకులను నిలదీశారు. దానికి వారు, ఇంట్లో సమస్యలు తొలగిపోవడానికి పూజలు చేస్తున్నామని సమాధానం చెప్పారు. నలుగురిలో ఒకడైన ఇట్టి రాము.. తన అత్తగారి ఫొటోతో పాటు, మరో అమ్మాయి ఫొటో ఉంచి క్షుద్రపూజలు చేసినట్లు ఆధారాలు లభించాయి. అలాగే రెండు నలుపు రంగు కోళ్లు, పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, తాయత్తులు, వేపకొమ్మలు వంటివి అక్కడ దొరికాయి. వారికి ఎవరో ఫోన్‌లో మంత్రాలు చదివి వినిపిస్తుంటే వీళ్లు అవే మంత్రాలు బిగ్గరగా చదువుతూ ఆ ఫొటోలపై పసుపు, కుంకుమ చల్లుతూ రెండు కోళ్లను బలిచ్చినట్లు అంగీకరించారు. దీంతో స్థానిక పెద్దలు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.