తిరుమలలో అలర్ట్.. నిఘా పెంచిన అక్టోపస్ బలగాలు
దేశంలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందనే ఐబీ హెచ్చరికలతో మరోసారి భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి. దేశంలోకి చొరబడిన ముష్కరులు దక్షిణ భారత దేశాన్ని టార్గెట్‌గా చేసుకొని ఎప్పుడైనా, ఎక్కడైనా దాడులకు తెగబడే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో తిరుమలలో భద్రత కట్టుదిట్టం చేశారు. ఆక్టోపస్ బృందం రంగంలోకి దిగి అనువనువు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అనుమానితులపై నిఘా ఏర్పాటు చేశారు. మొత్తం 40 మంది కమాండోలు తిరుమలను జల్లెడ పడుతున్నారు.
తిరుమలను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు ప్రవేశిస్తారని ఐబీ అధికారులు సమాచారం అందించారు. దీంతో ఉదయం, సాయంత్రం సమయాల్లో ఆలయ పరిసరాలతో పాటు తిరుమల ప్రాంతమంతా గస్తీ కాస్తున్నారు.నలుపురంగు దుస్తుల్లో ఆయుధాలు ధరించి, కాళ్లకు షూస్ లేకుండా తిరుమల మాడ వీధుల్లో తిరుగుతున్నారు. తరచూ ఉగ్ర హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో అక్టోపస్ సేవలను వినియోగించుకోవాలని టీటీడీ 2010లో నిర్ణయించింది. దీంతో ఇక్కడ ఓ డీఎస్పీ, సీఐ, ఇద్దరు ఎస్‌ఐలతో కలిపి దాదాపు 40 మంది అక్టోపస్ కమాండోలు అందుబాటులోకి వచ్చారు.