'Odela Railway Station' which is booming..1.5 crores in three days
mictv telugu

దూసుకెళ్తున్న ‘ఓదెల రైల్వేస్టేషన్’..మూడు రోజుల్లోనే 1.5 కోట్లు

August 30, 2022

యథార్థ సంఘటనల ఆధారంగా డైరెక్టర్ అశోక్‌ తేజ్‌ తాజాగా తెరకెక్కించిన చిత్రం ‘ఓదెల రైల్వేస్టేషన్’. ఈ చిత్రంలో యంగ్ హీరోయిన్ హెబ్బా పటేల్, వశిష్ట సింహ, సాయి రోనక్, పూజిత పొన్నాడ ప్రధాన పాత్రల్లో నటించారు. అయితే, ఈ సినిమా కథను ప్రముఖ డైరెక్టర్ సంపత్ నంది అందించారు. ఎప్పుడో చిత్రీకరణ మొదలైన ఈ చిత్రం..కరోనా కారణంగా పలుసార్లు వాయిదాలు పడుతూ, చిత్రీకరణ ఆలస్యమైంది. ఈ క్రమంలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈనెల 26వ తేదీన ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన ‘ఆహా’లో విడుదలైంది.

అయితే, ఈ సినిమాను డైరెక్టర్ అశోక్‌ తేజ్‌..క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే వ్యూస్ పరంగా రికార్డు సాధించింది. అంతేకాదు, సినిమాను వీక్షించిన ప్రతి సినీ ప్రియుడు సినిమాపై వారి వారి అభిప్రాయాలను తెలియజేస్తూ, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీంతో రోజు రోజుకూ సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఈ కారణంగా ఆహాకు కూడా వ్యూయర్ షిప్ భారీగా పెరుగుతోంది.

సినిమా విజయంపై సంపత్ నంది మాట్లాడుతూ..”మూడు రోజుల్లోనే ఈ సినిమా ఇంత పెద్ద విజయం సాధిస్తుందని అనుకోలేదు. కేవలం మూడు రోజుల్లోనే సినిమా 1.5 కోట్ల స్ట్రీమింగ్ మినిట్స్‌ను పూర్తి చేసుకుంది. అందుకు చాలా ఆనందంగా ఉంది. చిత్రబృందానికి నా తరుపున శుభాకాంక్షలు తెలుపుతున్నాను” అని సంపత్ నంది అన్నారు.