తనకు న్యాయం జరుగుతుందని పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఓ యువకుడిపై మహిళా ఎస్సై అమానుషంగా ప్రవర్తించింది. భూవివాదం పరిష్కరించండంటూ సదరు యువకుడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. ఎస్సై న్యాయం చేస్తుందని భావించాడు కానీ, అక్కడికెళ్లాక పరిస్థితులు తారుమారయ్యాయి. ఒడిశాలోని తరలసరువా గ్రామానికి చెందిన రాజు మహంత్ అనే యువకుడు భూతగాదా పరిష్కారం కోసం కియోంజార్ జిల్లాలోని పటనా పోలీసు స్టేషన్‌కు వెళ్లాడు. ఆ పీఎస్‌లో విధుల్లో ఉన్న ఎస్సై సంధ్యరాణి జెన సదరు యువకుడిపై దాడి చేసింది. దారుణంగా లాఠీతో కొట్టి హింసించింది. అంతటితో ఆగకుండా కాలితో తన్నింది. ఇంత జరుగుతుంటే పోలీసు స్టేషన్‌లోని మిగితా సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేయకుండా ప్రేక్షక పాత్ర వహించారు.
సదరు మహిళా ఎస్సై దాష్టికానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దీంతో ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించారు. సదరు అధికారిణిపై చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.