పీహెచ్‌డీలు చదివి తలపండిన శాస్త్రజ్ఞులే కరోనా మందును కనుక్కోవడానికి రాత్రింబవళ్లు కిందామీద అవుతున్నారు. తమ మేథస్సును ఎంత మథిస్తున్నప్పటికీ ఇంకా మందును కనుక్కోలేకపోతున్నారు. కానీ, ఓ వ్యక్తి మాత్రం కరోనాకు టీకా కనిపెట్టానని ప్రకటించాడు. మరి అతను చదివింది ఎంత అనుకుంటున్నారు.. కేవలం ఏడో తరగతే. ఏడో తరగతి చదివే కరోనా మహమ్మారి అంతం చూడటానికి టీకా కనిపెట్టిన ఆ ఉద్ధండుడు దానిని మార్కెట్లో అమ్మేందుకు కూడా యత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తన టీకా అమ్మేందుకు అనుమతి కావాలంటూ అధికారులకు ఓ ఈ-మెయిల్ కూడా పెట్టేశాడు. ఈ విచిత్ర ఘటన ఒడిశాలోని బార్‌ఘర్ జిల్లాలో ఇటీవల చోటు చేసుకుంది. సదరు ఏడో తరగతి శాస్త్రజ్ఞుడి పేరు ప్రహ్లాద్ బిసీ.
ప్రభుత్వ అనుమతి వచ్చే వరకు టీకా అమ్మనని పుణ్యం కట్టుకున్నాడు. లేకపోతే ఎన్ని ప్రాణాలను హరీ అనిపించేవాడో. అతను పంపిన ఈమెయిల్ చూసిన అధికారులు ఖంగుతిన్నారు. ఆఘమేఘాల మీద అక్కడికి వెళ్లారు. అక్కడ వారికి కరోనా వ్యాక్సిన్ అని రాసున్న కొన్ని వయల్స్, ఇతర కెమికల్స్ కనిపించాయి. ‘అయ్యా మేధావులకే మేధావీ.. ఈ టీకాను ఎలా తయారు చేశావయ్యా?’ అని ప్రహ్లాద్‌ను అధికారులు ప్రశ్నించారు. దానికి అతను ఏమాత్రం తడుముకోకుండా.. అదంతా పెద్ద రహస్యం.. నేను మీకు చెప్పను అని చెప్పాడు. ‘అలాగా అయితే పోలీస్ స్టేషన్‌కు పదమ్మ.. అక్కడైతే ఎలాంటి సీక్రెట్స్ అయినా ఇట్టే బయటకు వచ్చేస్తుంది’ అని అతడిని అరెస్టు చేశారు. వివిధ సెక్షన్లు కింద కేసు నమోదు చేశారు. మరోవైపు అతను గతంలో ఇతర మందులేమైనా తయారు చేసి స్థానికులపై ప్రయోగించాడేమోననే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు.