వలస కూలీల కోసం ఎంతో సాయం చేస్తున్నామని ప్రభుత్వాలు టాంటాం వేసుకుంటూ చెబుతున్నాయి. మరోపక్క ఎర్రటి ఎండలో కూలిబతులు కుప్పకూలుతున్నారు. స్వస్థలాలకు వెళ్తున్నకార్మికులు ఇళ్లకు చేరకముందే రోడ్లపైనే విగతజీవులుగా మారుతున్నారు. శ్రామిక్ రైళ్ల గురించి తెలియకపోవడం, టికెట్లకు భారీ డిమాండ్, టికెట్ బుకింగ్, ఎస్సెమ్మెస్‌లపై అవగాహన లేకపోవడం, అసలు సెల్ ఫోనే లేకపోవడం వంటి ఎన్నో దయనీయ పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి రోడ్లెక్కుతున్నారు.
740 కి.మీ దూరంలోని తన ఇంటికి వెళ్లడానికి బయల్దేరిన వలసకార్మికుడు తిండి దొరక్క అలసటతో రోడ్డుపైనే ప్రాణం విడిచాడు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని గుమ్మిడిపూండిలో మంగళవారం ఈ విషాదం చోటుచేసుకుంది. ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా లచ్చిపేటకు చెందిన రాంబిశ్వాస్(44) చెన్నైలో పనిచేస్తున్నాడు. లాక్ డౌన్ వల్ల బతుకు దుర్భరంగా మారడంతో తోటి కూలీలతో కలసి ఒడిశాకు బయల్దేరాడు. దారిలో ఆహారం, మంచినీరు దొరక్క ఇబ్బంది పడ్డాడు. చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారిపై గుమ్మిడిపూండికి రాగానే నిస్సత్తువతో కుప్పకూలి కన్ననుమూశాడు. రాష్ట్రంలో వసలకూలీలు నడవకుండా వారి కోసం ప్రత్యేక బస్సులు వేయాలని సీఎం జగన్ ఆదేశించడం తెలిసిందే. ఏపీలోనే కాదు, అన్ని రాష్ట్రాల్లో క్షేత్రస్థాయి పరిస్థితులు మాత్రం వలస కూలీల బతుకులను మరింత ఛిద్రం చేస్తూనే ఉన్నాయి.