కాలికి 20, చేతికి12 వేళ్లు ఉన్నాయని వృద్ధురాలిపై అమానుషం - MicTv.in - Telugu News
mictv telugu

కాలికి 20, చేతికి12 వేళ్లు ఉన్నాయని వృద్ధురాలిపై అమానుషం

November 25, 2019

నాగరిక సమాజంలో అనాగరిక పోకడలు బయటపడుతూనే ఉన్నాయి. పుట్టుకతో వచ్చిన లోపానికి తోటి మనిషిని అనుమానిస్తూ అమానుషంగా ప్రవర్తించారు. 20 కాలివేళ్లు, చేతులకి 12 వేళ్లు ఉండటంతో ఓ వృద్ద మహిళను మంత్రగత్తెగా చిత్రీకరించి ఇంటికే పరిమితం చేశారు. ఇంట్లో నుంచి అడుగు బయటపెట్టేది లేదంటూ హుకుం జారీ చేశారు. ఒడిశాలోని గంజాం జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది. 

కదపడ గ్రామానికి చెందిన నయక్ కుమారి (63) పుట్టుకతోనే ఎక్కువ వేళ్లను కలిగి ఉంది. పేదరికం కారణంగా వాటికి చికిత్స చేయించుకోలేకపోవడంతో అవి పెరిగిపోయాయి. ఇప్పుడు ఆమె చేతులు,కాళ్లు ఎక్కువ వేళ్లతో భయంకరంగా ఉన్నాయి. వాటిని చూసిన స్థానికులు మూఢ నమ్మకాలతోఆమెకు మంత్రాలు వస్తాయనే నెపంతో ఇళ్లు దాటనివ్వడంలేదు. దీంతో ఆమె ముసలితనంలో కారాగార శిక్షలా ఒంటరిగా మిగిలిపోయింది. తనకు ఆ చెర నుంచి విముక్తి కల్పించాలని ధీనంగా వేడుకుంటోంది. కాగా ఇది జన్యుపరలోపం వల్ల వచ్చే అసాధారణ ఘటనగా వైద్యులు చెబుతున్నారు. ప్రతి 5వేల మందిలో ఒకరికి ఇలా జరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు.