రూ. 2500 కోట్లు ఇస్తే సీఎం పోస్ట్ ఇస్తామన్నారు... బీజేపీ ఎమ్మెల్యే - MicTv.in - Telugu News
mictv telugu

రూ. 2500 కోట్లు ఇస్తే సీఎం పోస్ట్ ఇస్తామన్నారు… బీజేపీ ఎమ్మెల్యే

May 7, 2022

‘నీకు ముఖ్యమంత్రి పదవి కావాలంటే రెండున్నరవేల కోట్ల రూపాయలు ఇవ్వాల’ని కొంతమంది తనను సంప్రదించారని కర్ణాటక భాజపా ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన కొందరు తనకు ఈ ఆఫర్‌ ఇచ్చారని ప్రకటించారు. శుక్రవారం బెలగావి జిల్లాలోని రామదుర్గ్‌లో పంచమశాలి కమ్యూనిటీ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

రూ.2,500 కోట్లు ఇస్తే తనకు ముఖ్యమంత్రి పదవి ఇస్తామని కొంతమంది పవర్ బ్రోకర్లు తనను సంప్రదాంచారని చెప్పారు బసనగౌడ. అయితే వారు ఎవరనేది మాత్రం చెప్పలేదు. పార్టీ టికెట్‌ ఇప్పిస్తాం.. సోనియా గాంధీ, జేపీ నడ్డాతో సమావేశం ఏర్పాటు చేస్తామంటూ కొందరు వస్తుంటారన్న బసనగౌడ్.. అలాంటి వారు తనవద్దకు ఓ సారి వచ్చినట్లు తెలిపారు. రెండున్నర వేల కోట్లు ఇస్తే సీఎం చేస్తామని ప్రతిపాదించినట్లు వివరించారు. అయితే ఇలాంటి మాటలకు మోసపోవద్దంటూ ఆయన కార్యకర్తలకు హితవు పలికారు.

ఇటీవల హిజాబ్‌, హలాల్‌ వంటి వివాదాలతో ముఖ్యమంత్రి బసవరాజ్‌ బమ్మై ప్రభుత్వంపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చిన సంగతి విదితమే. తాజాగా కాషాయ పార్టీ ఎమ్మెల్యే బసనగౌడ సిఎం ఆఫర్‌ పై వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.