సినిమాలకు సంబంధించి ఆస్కార్ తర్వాత ఆ రేంజులో పేరు ప్రఖ్యాతులున్న కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో భారత్కు అరుదైన గౌరవం దక్కింది. కేన్స్ చలన చిత్రోత్సవాలు మే 17 నుంచి 28 వరకు జరుగనున్నాయి. ఇదికాక, ఈ ఏడాదితో కేన్స్ ఫిలిం ఫెస్టివల్ ప్రారంభమై 75 ఏళ్లు అవుతోంది. ఇదే సమయంలో భారత్కు కూడా స్వాతంత్ర్యం వచ్చి ఈ ఏడాదితో 75 వసంతాలు పూర్తవుతాయి. ఈ నేపథ్యంలో నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
కేన్స్ చిత్రోత్సవ విపణిలో అధికారిక దేశ హోదాను కల్పించారు. దీంతో మన సినిమాలు అక్కడ ప్రదర్శించే అవకాశం ఉంటుంది. ఈ సారి హొదా వచ్చిన నేపథ్యంలో దిగ్గజ దర్శకుడు సత్యజిత్ రే తెరకెక్కించిన ‘ప్రతిధ్వని’ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. ఇందుకోసం ఈ చిత్రాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా 4కె టెక్నాలజీతో పునరుద్ధరిస్తున్నారు. దీంతోపాటు మరో భారత చిత్రం ‘థాంప్’ కూడా ప్రదర్శింపబడుతోంది. ఇదిలా ఉండగా, కొద్ది రోజుల క్రితమే బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే కాంపిటీషన్ జ్యూరీలో సభ్యురాలిగా నియమితులయ్యారు.