Officials have solved the mystery of a huge pit formed in Chile
mictv telugu

వీడియో : వీడిన మిస్టరీ.. భారీ గొయ్యి ఎలా ఏర్పడిందంటే

August 17, 2022

చిలీ రాజధాని శాంటియాగోకు 800 కిలోమీటర్ల దూరంలో ఈ నెల మొదట్లో ఏర్పడిన భారీ గొయ్యి మిస్టరీ వీడింది. దాదాపు 200 మీటర్ల లోతైన గుంత, మన స్టాట్యూ ఆఫ్ యూనిటీ విగ్రహాన్ని మింగేసేంత సామర్ధ్యం ఉన్న ఈ భారీ గుంతను చూసి ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది. రోజురోజుకీ వెడల్పు పెరుగుతూ పోతుండడంతో ఏదో వినాశనం తప్పదనే ప్రచారమూ ఊపందుకుంది. కొందరైతే ఈ పని వెనుక ఏలియన్స్ ఉన్నారనే వాదనలూ వినిపించారు. అయితే ఈ అతిశయోక్తుల వెనుక అతి ప్రచారమే ఉందని తేలుస్తూ అక్కడి అధికారులు అసలు విషయం బయటపెట్టారు.

ప్రాథమిక దర్యాప్తులో ఎలాంటి అంచనాకు రాలేకపోయిన అధికారులు.. ఇప్పుడు మిస్టరీని దాదాపుగా ఛేదించారు. మానవ కార్యకలాపాల వల్లే ఈ భారీ గొయ్యి ఏర్పడిందనే నిర్ధారణకు వచ్చారు. గొయ్యికి సమీపంలోనే నిర్వహించిన భారీ మైనింగ్ కార్యకలాపాల వల్ల గుంత ఏర్పడిందని, దానిని పూడ్చివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు. గొయ్యి ఏర్పడిన ప్రాంతంలో ఓ కెనడా కంపెనీ కాపర్ ఉత్పత్తి చేస్తుండగా, ప్రపంచంలోనే ఎక్కువ కాపర్ ఉత్పత్తయ్యే ప్రదేశంగా ఈ ప్రాంతం పేరుగాంచింది. ఈ విషయంపై మైనింగ్ మినిస్టర్ మార్సెలా హెర్నాండో స్పందిస్తూ.. మితిమీరిన మైనింగ్ కార్యకలాపాల కట్టడికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాగా, ఇప్పటికే ఈ ప్రాంతంలో నివసించే ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.