సౌదీ ఎఫెక్ట్.. పెరగనున్న పెట్రోలు, డీజిల్ ధరలు!
మన దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ చమురు మార్కెట్ నిపుణులు సోమవారం తెలిపారు. దీనికి కారణాలను కూడా వెల్లడించారు. సౌదీ అరేబియాలోని చమురు నిల్వలపై యెమెన్‌కు చెందిన హౌతి తిరుగుబాటుదారులు డ్రోన్లతో శనివారం దాడి చేశారని.. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగకపోయినా.. రోజుకు 57 లక్షల బ్యారెళ్ల చమురు సరఫరా నిలిచిపోయిందని పేర్కొన్నారు. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌కు రోజుకు ఐదు శాతం చొప్పున చమురు సరఫరా నిలిచిపోయిందని తెలిపారు. ఇరాన్ ప్రోత్సాహంతో యెమెన్‌కు చెందిన హౌతి మిలిటెంట్లు ఈ దాడికి పాల్పడ్డారని అంతర్జాతీయ మీడియా తెలియజేస్తోంది. ఈ దాడికి పాల్పడింది ఇరానేనని అమెరికా నేరుగా ఆరోపిస్తోంది. దీంతో ఇరాన్‌పై అమెరికా దాడి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఉద్రిక్తల కారణంగా కూడా అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది.
అయితే అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పెరగకుండా నివారించేందుకు తక్షణమే అమెరికా దేశీయ చమురు నిల్వలను విడుదల చేయాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశించారు. సౌదీపై ఈ దాడికి పాల్పడింది ఎవరో ఇప్పటికే గుర్తించామని, వారిపై ప్రతీకార దాడి జరిపేందుకు ఆయుధాలు సిద్ధం చేసుకున్నామని, సౌదీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మరుక్షణం దాడికి పాల్పడతామని ట్రంప్ హెచ్చరించారు.
ట్రంప్ నిర్ణయంపై నిపుణులు భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నారు. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రెండు, మూడు రోజులు అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పెరగకుండా నిలబడవచ్చని అంటున్నారు. మంటల్లో చిక్కుకుని తీవ్రంగా నష్టపోయిన సౌదీ అరేబియా చమురు సంస్థ ఎప్పటిలాగా తమ చమురు ఉత్పత్తుల సరఫరాను పునరుద్ధరించగలదనే అంశంపై ఆధారపడి చమురు ధరలు పెరగడం, పెరగకుండా ఉండడం ఉంటుందని భావిస్తున్నారు. కాగా, ప్రస్తుత సౌదీ అరేబియా చమురు నిల్వల నుంచి పొగ వెలువడుతుండటంతో సంస్థ సరఫరాపై అనిశ్చితి నెలకొంది.