ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో పురాతన పంచ ముఖా వినాయక విగ్రహం కలకలంరేపింది.. పంచ ముఖాలు కలిగిన ఈ మరకత విగ్రహాన్ని 25 కోట్ల రూపాయలకు అమ్మేందుకు ప్రయత్నించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విగ్రహాన్ని అమ్మేందుకు ప్రయత్నించింది కూడా సామాన్యులు కాదని తెలుస్తోంది. ప్రముఖ వ్యక్తులే ఈ మరకత విగ్రహాన్ని పాతిక కోట్ల రూపాయలకు అమ్మేందుకు బేరసారాలు చేయడంతో ఇది బయటపడిందని అంటున్నారు.. పక్కా సమాచారం అందుకున్న నిఘా విభాగానికి చెందిన అధికారులు విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ విగ్రహంతో పాటూ ఉన్న ఇంద్రసేనారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి అనే వ్యక్తులని అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
అయితే, పొలిటీషియన్స్ పైరవీలతో ఆ మరకత విగ్రహాన్ని యర్రగొండపాలెం పోలీసులకు అప్పగించి వెళ్లిపోయినట్లు టాక్ వినిపిస్తోంది. కోట్ల రూపాయలు విలువచేసే ఈ మరకత విగ్రహం ప్రస్తుతం యర్రగొండపాలెం పోలీస్స్టేషన్ ఉందని చెబుతున్నారు. ఈ విగ్రహం వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.