కంప్యూటర్ మౌజ్ ధర ఎంతుంటుంది? రెండొందలు, మూడొందలు. పేరు మోసిన బ్రాండెండ్ కంపెనీలవైతే ఐదొందలు, వెయ్యి. ఇంకా ఖరీదైనవి బహుశా 5 వేలు. మౌజులు ధర అంతకు మించి ఉండదు. కానీ ఓ కరెంట్ ఎలుక మాత్రం కళ్ల బైర్లు కమ్మే ధరకు, అక్షరాలా కోటిన్నరకు అమ్ముడుబోయింది. అంటే, వజ్రాలు, రత్నాలు, ప్లాటినం వంటి విలువైనవి పొదిగిన మౌజేమో అనుకుంటున్నారు కదా. కాదు. అది మామూలు మౌజే. పైగా తాతల కాలం నాటిది. మరెందుకు అంత ధర అని కదా మీ అనుమానం? ఏ ప్రత్యేకతా లేకపోతే అంత ధర పలకదు కదండీ. అవును, అది యాపిల్ కంపెనీ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ మెచ్చిన మౌజ్. అతని ఆవిష్కరణలకు, విజయాలకు స్ఫూర్తిగా నిలిచిన మౌజ్. అందుకే అంత ధర. కంప్యూటింగ్ మేధో దిగ్గజం డగ్లస్ ఎంగెల్‌బార్ట్ దీన్ని తయారు చేశాడు. ఇది ఇప్పుడు వాడుతున్న మౌజులకు తాత. చూడ్డానికి బండగా, ప్లగ్ బాక్సులా ఉంటుంది. మూడు బటన్లు ఉంటాయి. కోడింగ్ కీసెట్ బోస్టన్ ద్వారా పనిచేస్తుంది. బోస్టన్‌కు చెందిన ఆర్ఆర్ వేలం సంస్థ దీన్ని 12 వేల డాలర్ల తొలి పాటతో వేలం వేయగా అనూహ్యంగా 1.47 లక్షల పౌండ్లకు అమ్ముడుబోయింది. మన కరెన్సీలో 1,48,89,174 రూపాయలు.
విశేషాలు..
కంప్యూటర్ నిపుణులు దీన్ని మదర్ ఆఫ్ ఆల్ డెమోస్ అని ప్రశంసిస్తంటారు. ఈ మౌజ్ ద్వారా కీసెట్లో ఐదు కీల సాయంతో 13 కీలను నొక్కొచ్చు. స్టీవ్ జాబ్స్ 1979లో ఓ రీసెర్చి సెంటర్‌కు వెళ్లిప్పుడు దీన్ని చూసి ముచ్చటపడ్డాడు. తను తయారు చేయబోయే ఆపిల్ కంప్యూటర్లకు కూడా దీన్ని జత చేయాలనుకున్నాడు. అయితే అప్పట్లోనే దాని ఖరీదు 242 పౌండ్లు. పైగా పనితీరు కూడా ఆశినంత బాలేకపోవడంతో 12 పౌండ్లకే కొనుక్కునేలా వన్ బటన్ మౌస్ తయారు చేశాడు. 2025లో పుట్టి 2013లో కన్నుమూసి ఎంగెల్‌బార్ట్ అమెరికన్ ఇంజినీరు, ఆవిష్కర్త, ఇంటర్నెట్ దిగ్గజం. ప్రొటోటైప్ కంప్యూటర్లతోపాటు మౌజ్ వంటి అనేక డివైజుల రూపకల్పనకు అహరహం శ్రమించాడు.