చెట్టుపైనే ప్రాణాలు.. ముసలి జంట కన్నీటి కథ.. - MicTv.in - Telugu News
mictv telugu

చెట్టుపైనే ప్రాణాలు.. ముసలి జంట కన్నీటి కథ..

November 21, 2019

Old Couple Living on Top a Tree for Fear of Elephants at Assam

నమ్ముకున్న నేల హామీ ఇవ్వలేకపోయింది. ప్రాణాలు దక్కించుకోడానికి ఆ వృద్ధ దంపతులు చెట్టుపైన నివాసం ఉంటున్నారు. వారితో పాటు ఓ కుక్క, పిల్లి, కోళ్లు కూడా ఉంటున్నాయి. అసలే వృద్ధులు చెట్టు ఎలా ఎక్కుతారు? పాపం వారికి ఇల్లు లేదా? వారికి ఈ గత్యంతరం ఎందుకు పట్టింది? దీనికి కారణం ఎవరు? ఇత్యాది ప్రశ్నలకు ఒకటే సమాధానం. అవే ఏనుగులు. అవి వారి పాలిట ప్రతినాయకులుగా వ్యవహరించి వారి ఇళ్లను ధ్వంసం చేశాయి. 

ఏనుగులకు కోపం వచ్చిందంటే ఎంత బీభత్సం సృష్టిస్తాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదేమో. అసోంలోని ఉదల్గుడీ జిల్లాలో గజరాజులు ఇటీవల విరుచుకుపడి ఇళ్లను, పొలాలను ధ్వంసం చేశాయి. వీటి ధాటికి ఈ వృద్ధ దంపతులు ఇల్లు కూడా చిన్నాభిన్నం అయింది. దీంతో వారు నిరాశ్రయులయ్యారు. మరో గత్యంతరం లేక, ఏనుగుల నుంచి తప్పించుకోవడానికి వారిద్దరూ చెట్టుపై నివాసం ఏర్పరుచుకున్నారు. తమ ప్రాణాలు కాపాడుకోవడానికి ఇంతకన్నా వేరే దారిలేదని అంటున్నారు. కనీసం నడవడానికి కూడా శక్తి చాలని వీరిద్దరు రోజూవారి అవసరాల కోసం శక్తి కూడదీసుకుని చెట్టు ఎక్కుతున్నారు, దిగుతున్నారు. పెంపుడు జంతువులు చెట్టుపై వీరికి తోడుగా ఉంటున్నాయి.