చివరి రోజుల్లో అండగా నిలుస్తారని అనుకున్న కన్న కొడుకులే తల్లిదండ్రులను కాదు పొమ్మన్నారు. పేరుకు నలుగురు కొడుకులు ఉన్నా వారికి పూట తిండికి కష్టడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వృద్ధాప్యంలో ఏ పని చేసుకోలేక ఇబ్బంది పడుతూ కాలం వెళ్లదీశారు. కొడుకు తీరుతో విసిగిపోయి చివరకు ఆ తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పందిల్ల గ్రామంలో ఇది చోటు చేసుకుంది.
తాడూరి దుర్గయ్య (75), భార్య లచ్చవ్వ (70)తో కలిసి జీవిస్తున్నాడు. వీరికి నలుగురు కొడుకులు. ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అందరికి పెళ్లిలు చేసి చివరి రోజుల్లో తమకు బువ్వ పెట్టాలని కోరారు. అయినా కూడా ఎవరూ పట్టించుకోలేదు. ఇటీవల లచ్చవ్వకు కాలు విరగడంతో మూడో కుమారుడి ఇంట్లో ఉన్నారు. కానీ అతడు కూడా ఇటీవల గెంటివేయడంతో దుర్గయ్య సోమవారం పోలీసులను ఆశ్రయించాడు. తమకు తిండి కూడా పెట్టడం లేదని గోడు వెళ్లబోసుకున్నాడు. వెంటనే ఎస్సై సుధాకర్ దుర్గయ్య కొడుకులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చాడు. మరోసారి ఇలాంటి ఘటన పునరావృతం కాకూడదని చెప్పాడు. వారు కూడా తల్లిదండ్రులను బాగా చూసుకుంటామని వారు హామీ ఇచ్చి ఇంటికి తీసుకెళ్లారు. దీంతో కథ సుఖాంతమైంది.