కొడుకు కంటే కుక్క నయం.. ఆస్తిని కుక్క పేరున రాశాడు..  - MicTv.in - Telugu News
mictv telugu

కొడుకు కంటే కుక్క నయం.. ఆస్తిని కుక్క పేరున రాశాడు.. 

December 31, 2020

bfgbfgb

‘అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి..’ అనే తెలుగు పాట ఒకటుంది కదా. అందులో ‘కూరిమి గల వారంతా కొడుకులేనురా.. జాలి గుండె లేని కొడుకు కంటే కుక్క మేలురా.. కుక్క మేలురా’ అని పాడతాడు గాయకుడు. మధ్యప్రదేశ్‌లోని చింధ్వాడా జిల్లా బరిబాదా గ్రామానికి చెందిన ఓం నారాయణ అనే రైతు కూడా ప్రస్తుతం ఇలాగే పాడుకుంటున్నాడు. ‘నా కొడుకు కంటే ఈ కుక్క నయం.. నమ్మకంగా నన్నే అంటిపెట్టుకుని ఉంటోంది. ఇంటికి చక్కగా కాపలా కాస్తోంది…’ అంటున్నాడు. కేవలం అని ఊరుకోలేదు. కొడుక్కి ఒక్క పైసా కూడా ఇవ్వకుండా ఆస్తిని ఆ కుక్క పేరుపైన రాశాడు.

నారాయణను కొడుకు రాచిరంపాన పెట్టడమే దీనికి కారణం. కొడుకు ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో పెద్దాయన విసిగిపోయాడు. తను చనిపోతే ఆస్తిని కొడుకు లాక్కుంటాడని భయపడి ముందు జాగ్రత్తగా వీలునామా రాశాడు. తన ఆస్తిలో సగ భాగాన్ని జాకీ అనే పెంపుడు కుక్కకు, మిగతా సగ భాగాన్ని భార్య చంపకు దక్కాలని అందులో వివరించాడు.

‘నా కొడుకుతో చాలా గొడవలు ఉన్నాడు. వాడికి నా ఆస్తిపై తప్ప నాపై రవ్వంత ప్రేమ కూడా లేదు. నా కుక్క, నా భార్య నన్నెంతో బాగా చూసుకుంటున్నారు. అందుకే నా ఆస్తి కుక్కకు, భార్యకే రాశాను.. నేను చచ్చిపోయాక నా కుక్క బాగోగులను ఎవరు చూసుకుంటారో వారికే దాని ఆస్తిపై హక్కు ఉంటుంది.. అది చచ్చిపోతే దాని ఆస్తి కూడా వారికే చెందుతుంది..’ అని రాశాడు. జాకీ పేరుతో ఆయన రెండు ఎకరాల ఆస్తి రాశాడు.