Home > Featured > ముసలాడు మామూలోడు కాదు.. ఉప్పొంగే నదులే టార్గెట్ 

ముసలాడు మామూలోడు కాదు.. ఉప్పొంగే నదులే టార్గెట్ 

ఉదృతంగా ప్రవహిస్తున్న నదిని చూస్తే మనం గజగజా వణికిపోతాం. కొంచెం నీరు ఎక్కువగా ఉన్నా ఈతకొట్టాలంటే ఒకటికి పది సార్లు ఆలోచిస్తాం. కానీ 60 ఏళ్ల వెంకటేశ్ మూర్తి మాత్రం ఏటికి ఎదురీదుతాడు. కోపోద్రేకంతో పొంగుతున్న నదిని అవలీలగా జయించాడు. ఏ మాత్రం బెరుకు లేకుండా వెల్లవెత్తే నదిలో దూకేస్తాడు. ఈ వరదల సీజన్లోనూ అలంటి సాహసం చేశారు. నదిలో దూకి రెండు రోజులు అందులోనే ఉండిపోయాడు. చివరకు ఎవరి సాయం లేకుండానే ఒడ్డుకు చేరి అందరినీ ఆశ్చర్యపరిచాడు. కర్నాటకలోని నంజన్‌గూడ్ పట్టణంలో ఇది జరిగిందీ సాహసం. అక్కడి ప్రజలంతా వరదలకు భయపడి పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటే అతడు మాత్రం ఏకంగా నదిలో దూకాడు. అతడు దూకుతున్న సమయంలో తీసిన వీడియో కాస్తా వైరల్ అయింది.

కర్నాటకలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కబిని నదికి వరద పోటెత్తడంతో శనివారం రిజర్వాయర్ గేట్లు ఎత్తారు. దీంతో నంజన్‌గూడ్ ప్రాంతంలో అంతా తమ ఇళ్లు వదిలి పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. కానీ వెంకటేష్ మూర్తి మాత్రం అందరిలా కాకుండా ఉప్పొంగుతున్న నదిని చూసి అందులో దూకేశాడు. ఇదే నదిని సవాల్ చేసేందుకు దొరికిన అవకాశంగా భావించాడు. కానీ అతన్ని కాపాడేందుకు చాలా మంది ప్రయత్నించారు. వీలుకాకపోవడంతో వరదలో కొట్టుకుపోయి ఉంటాడని అనుకున్నారు. కానీ రెండు రోజుల తరువాత అతడు తిరిగి వచ్చాడు.

వెంకటేస్ మూర్తి తిరిగి రావడంలో పెద్దగా ఆశ్చర్యమేమి లేదని అతడి సోదరి మంజుల చెబుతున్నారు. అతడు గత 30 సంవత్సరాలుగా ఉప్పొంగే నదికి ఎదురీదుతూ ఒడ్డుకు చేరుకుంటూ ఉండేవాడని వెల్లడించారు. ప్రతిసారి అరగంటలో తిరిగి వచ్చేవాడని కానీ ఈసారి మాత్రం వరద ఎక్కువగా ఉండటంతో రెండు రోజుల సమయం పట్టిందని చెప్పారు. రెండు రోజులు నదిలోనే ఉండి ఉధృతి తగ్గిన తరువాత బయటకు వచ్చినట్టు వెంకటేష్ మూర్తి చెప్పాడు.ఏమైనా నదికి ఎదురీది అజేయుడిగా తిరిగిరావడం మాత్రం ఓ అద్భుతమైన విషయమే అని చెప్పాలి.

Updated : 14 Aug 2019 8:44 AM GMT
Tags:    
Next Story
Share it
Top