కోడలు పెన్షన్ లాక్కోవడంతో మనస్థాపం చెందిన ఓ 90 ఏళ్ల వృద్ధురాలు రిజర్వాయర్లో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. సిరిసిల్ల జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే అక్కడ ఉన్న లేక్ పోలీసులు ఆమెను గుర్తించి ప్రాణాలు కాపాడారు. కోడలు పెన్షన్ లాక్కోవడం వల్లే తాను ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్టు వెల్లడించింది. దీంతో ఆ మహిళను తన కొడుక్కు అప్పగించిన పోలీసులు కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చారు.
సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన నరికుల్ల లచ్చవ్వ అనే వృద్ధురాలు కోడలు వేధింపులు భరించలేక మానేరు డ్యాంలో దూకి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఆమె భర్త గతంలో బీసీ వెల్ఫేర్ హాస్టల్లో పని చేసేవాడు. అతని మరణంతో అప్పట్లో రూ. 10 వేలు పెన్షన్ వచ్చింది. ఆ తర్వాత ఆ ఉద్యోగం కొడుక్కు రావడంతో ఆ డబ్బులు కూడా కోడలు లాగేసుకుంది. దీంతో మనస్థాపం చెందిన ఆమె మానేరు డ్యాం వరకు నడిచి వచ్చి రెయిలింగ్ నుంచి నీటిలో దూకేసింది. ఆమెను రక్షించిన పోలీసులు.. ఇంకోసారి ఇంట్లో వేధింపులు జరిగినట్టు తెలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించి పంపించారు.