ప్రేమకు వయసుతో పనేమిటి? అని మాటవరకు అంటూ ఉంటాం. విషయం మనకు వరకు వస్తే మాత్రం కాస్త ఆలోచిస్తాం. వధూవరుల వయసులో ఐదేళ్లు, పదేళ్లు తేడా ఉంటే పెద్దగా పట్టించుకోవాల్సిన విషయం కాదు. అయితే ఏకంగా 40 ఏళ్లు, 50 ఏళ్లు తేడా ఉంటే? ఆశ్చర్యంగానే కాదు, తమాషాగానూ ఉంటుంది కదా!
బ్రిటన్కు చెందిన ఓ బామ్మ, ఈజిప్టుకు చెందిన ఓ యువకుడి కథ కూడా అలాంటిదే. ఆమె వయసు 81 ఏళ్లు. అతనికేమో 35 ఏళ్లు. కాటికి కాళ్లు చాపుకున్న వయసులో బామ్మగారు తనకంటే 45 ఏళ్లు చిన్నవాడైన పరాయి దేశం వాడిని ప్రేమించి, పట్టుబట్టి మరీ పెళ్లి చేసుకుంది. హనీమూన్ అని, అదనీ, ఇదీనీ తెగ ఎంజాయ్ చేస్తోంది.
ఆమె పేరు ఐరిష్ జోన్స్, అతని పేరు మహమ్మద్ అహ్మద్ ఇబ్రహీం. బామ్మగారు ఈజిప్టుకు టూర్కు వెళ్లినప్పుడు అతడు పరిచయమయ్యాడు. లేటు వయసులో ఘాటు ప్రేమ మొలకెత్తింది. అతనికి కూడా ఆమె తెగ నచ్చేసింది. ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. జోన్స్ తన కుర్ర భర్తను బ్రిటన్కు తీసుకెళ్లింది. ఆమెకు తొలి భర్త ద్వారా కలిగిన ఇద్దరు కొడుకులు ఘనంగా స్వాగతం పలికారు. వారి వయసు 50 పైనే.
‘ప్రేమకు వయసుతో సంబంధం ఏమిటి? నాకు జీవితంలో తోడు కావాలి. అందుకే ఇబ్రహీంను పెళ్లి చేసుకున్నా. వయసు మధ్య తేడా ఉన్నా మేం మా జీవితాలను ఎంజాయ్ చేస్తున్నాం..’ అంటోంది బామ్మ. వయసు తేడా వల్ల దాంపత్య జీవితంలో కొన్ని సమస్యలు ఉన్న మాట నిజమేనని, వైద్యులు సంప్రదించి వారి సూచించిన మందులూ, మాకులూ వాడుతున్నామని నవ్వుతూ చెబుతోంది.