Olympic medalist Lovlina Borgohain bags gold at World Boxing Championship, India's tally climb to four
mictv telugu

Women’s World Boxing Championship: ఎదురులేని భారత్..లవ్లీనాకు పసిడి

March 26, 2023

Olympic medalist Lovlina Borgohain bags gold at World Boxing Championship, India's tally climb to four

మహిళల వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్‌లో భారత్ పంచ్ పవర్ ఏంటో ప్రపంచానికి చూపించింది. మొత్తం నాలుగు స్వర్ణాలు భారత్ ఖాతాలో చేరాయి. 75 కేజీల విభాగంలో మరో భారత బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ పసిడి పతకాన్ని ముద్దాడింది. ఫైనల్లో లవ్లీనా ఆస్ట్రేలియా బాక్సర్ పార్కర్ కైట్లిన్‌పై 5-2 తేడాతో విజయం సాధించింది. శనివారం రెండు బంగారు పతకాలు దక్కించుకున్న భారత్..ఆదివారం మరో రెండు గోల్డ్ మెడల్స్ ను కొల్లగొట్టింది. 50 కేజీల విభాగంలో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ ఫైనల్లో విజయం సాధించిన కాసేపటికే లవ్లీనా గోల్డ్ మెడల్ తెచ్చిపెట్టింది. దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో మ్యాచ్‌ జరిగింది

2018 మరియు 2019 ఎడిషన్‌లలో కాంస్యంతో సరిపెట్టుకున్న లవ్లీనాకు ఇదే మొదటి స్వర్ణం. టోక్యోలో కాంస్య పతకాన్ని గెలుచుకున్న తర్వాత లవ్లీనా పలు టోర్నీల్లో పెద్దగా రాణించలేదు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లు మరియు కామన్వెల్త్ గేమ్స్‌లో రెండు మార్కులను సాధించడంలో విఫలమైంది. అయితే ఆమె నేషనల్స్‌లో అదరగొట్టింది. గత ఏడాది నవంబర్‌లో జరిగిన ఆసియా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని కూడా సాధించింది.

తిరుగులేని నిఖత్ జరీన్

లవ్లీనా గెలుపుకుముందు నిఖత్ జరీన్‎కు 50కేజీల విభాగంలో గోల్డ్ మెడల్ దక్కింది. ఫైనల్ మ్యాచ్ లో వియత్నాంకు చెందిన న్గుయెన్ థీ టామ్‌ను నిఖత్ 5-0తో చిత్తు చేసింది. 2022లో ప్రపంచ టైటిల్‌ను గెలుచుకున్న నిఖత్ జరీన్..రెండోసారి కైవసం చేసుకుని రికార్డు పుస్తకాలను తిరగరాసింది. ఈ విజయంతో ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో లెజెండరీ మేరీ కోమ్ తర్వాత ఎక్కువ బంగారు పతకాలను గెలుచుకున్న రెండవ భారతీయురాలు నిఖత్ జరీన్. మేరీ కోమ్ తన అద్భుతమైన కెరీర్‌లో ఆరు ప్రపంచ ఛాంపియన్‌షిప్స్ (2002, 2005, 2006, 2008, 2010 మరియు 2018) స్వర్ణాలను గెలుచుకుంది నిఖత్ 2022 మరియు 2023 ఎడిషన్లలో గోల్డ్ మెడల్స్ సాధించింది.

4 బంగారు పతకాలు

ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ మొత్తం 4 బంగారు పతకాలు దక్కాయి. శనివారం జరిగిన 48 కేజీల విభాగంలో నీతూ ఘంఘాస్, 81 కేజీల విభాగంలో సావిటీ బూరా స్వర్ణం దక్కించుకున్నారు. ఆదివారం నిఖత్ జరీన్, లవ్లీనా బోర్గహైన్ గోల్డెన్ పంచ్‎లు విసిరారు.