ఓంపురీ.. సరిలేరు నీకెవ్వరు... - MicTv.in - Telugu News
mictv telugu

ఓంపురీ.. సరిలేరు నీకెవ్వరు…

October 18, 2017

మనకు ‘అంకురం’(1993)సినిమా ఓంపురిని తెలుగు పరిశ్రమకు పరిచయం చేసింది. ఆ సినిమాలో అతడు పోషించిన నక్సలైట్ సత్యం పాత్ర నిడివి చాలా తక్కువే అయినా తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ గుర్తుండిపోయేలా నటించాడు. అసలు కళాత్మక, సమాంతర చిత్రాలు అనగానే ఇండియన్ సినిమాకి గుర్తొచ్చేది నాలుగు పేర్లు.. నసీరుద్దీన్ షా, షబానా అజ్మీ, స్మితా పాటిల్, ఓంపురి. ఈ రోజు ఆయన జయంతి.

ఓంపురి జీవితమే ఓ సినిమాలా వుంటుంది. ‘మచ్చల ముఖం..  బక్క శరీరం.. నువ్వేం పనికొస్తావు సినిమాలకు’ అన్ని నోళ్లను అతడు కేవలం నటననే నమ్ముకుని గట్టిగా మూయించాడు. పేదరికం కారణంగా చిన్నతనంలో బాలకార్మికుడిగా ఎన్నో పనులు చేశాడు. చివరికి ప్రతిష్టాత్మక నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో చేరటంతో నటుడయ్యాడు. పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చదివేప్పుడు ఫీజులు కూడా కట్టలేకపోయాడు. నసీరుద్దీన్ షా తో స్నేహం ఓంపురికి ఒక ఆలంబనగా నిలిచింది. ఆక్రోష్(1980),అర్ధసత్య(1982) లాంటి చిత్రాలతో అతను కళాత్మక చిత్రాల ఒక మెధడ్ ఆర్టిస్టుగా ఎదిగాడు.

డిస్కో డాన్సర్(1982)లాంటి కమర్షియల్ మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో కూడా క్యారక్టర్ ఆర్టిస్ట్‌గా విలన్ గా ఎన్నో పాత్రలు పోషించాడు. అంతే కాదు రికార్డ్ స్థాయిలో పదిహేడు ఇంగ్లీష్ చిత్రాలు చేశాడు. వాటిలో సిటి ఆఫ్ జాయ్(1992)తో పాటు ఎన్నో హాలీవుడ్ చిత్రాలు వున్నాయి. అంతర్జాతీయ నటుడిగా కొనసాగుతూనే ఎన్నో టివీ సీరియల్స్ లో కామెడీ పాత్రలు చేసి మెప్పించాడు. అతను పేరుకే నటుడు నిజానికి అతని చేతిలో పాత్ర పడ్డాక జీవించడం మొదలెడుతుంది. సినిమా నటనకి ఓ గౌరవం తెచ్చిన ఓంపురి ఎన్నో అవార్డులతో పాటు మనదేశం యిచ్చే పద్మశ్రీ, హానరరీ ఆఫీసర్ ఆఫ్ఆర్డర్ ఆఫ్ ది బ్రిటీష్ ఎంపైర్లాంటి అంతర్జాతీయ గౌరవం కూడా దక్కించుకున్నాడు. ఆక్రోశ్, అర్థ్ సత్య, సద్గతి.. మరెన్నో కళాత్మక, కమర్షియల్ చిత్రాల్లో విలక్షణ నటనతో ఆకట్టుకున్న ఓపురి లాంటి మరో నటుడు లేని లోటు భారతీయ సినీపరిశ్రమకే కాదు, ప్రపంచ సినిమాకూ ఇప్పట్లో తీరదు.