పోలీసుల దౌర్జన్యం.. యువకుడు స్పృహతప్పినా లాఠీలతో చితగ్గొట్టారు.. - Telugu News - Mic tv
mictv telugu

పోలీసుల దౌర్జన్యం.. యువకుడు స్పృహతప్పినా లాఠీలతో చితగ్గొట్టారు..

May 24, 2020

Madhya Pradesh

రోడ్డు మీద కనిపించిన ఓ యువకుడిని పోలీసులు దారుణంగా చితకబాదారు. పోలీస్ దెబ్బలకు తాళలేక అతను స్పృహ కోల్పోయాడు. అయినా పోలీసులు అమానవీయంగా అతనిని లాఠీలతో కొడుతున్నారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో వ్యక్తిపై లాఠీదెబ్బల వర్షం కురిపించాడో పోలీస్. మరొకతను కూడా దెబ్బలు అందుకున్నాడు. రెండు దెబ్బల అతని తలమీద, మెడ మీద బలంగా పడటంతో అతను స్పృహ కోల్పోయి కింద పడ్డాడు. అయినా పోలీసులు కొట్టడం ఆపడంలేదు. కాలితో తన్నుతూ లాఠీతో బలంగా కొడుతున్నారు. అతను చలనం లేకుండా పడిపోయాడు, ఏమైందోనని వారిలో ఒక్కరు కూడా చూడలేకపోయారు. అక్కడికి వచ్చిన మరో వ్యక్తి సాయంతో అతన్ని వ్యానులో వేసుకుని వెళ్లారు. ఇదంతా స్థానికంగా ఉన్న ఓ షాపతను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. 

దీంతో ఈ వీడియో బాగా వైరల్‌గా మారి, పోలీసు ఉన్నతాధికారులకు చేరడంతో కృష్ణ డోంగ్రే, ఆశిష్ అనే ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేసారు. అయితే బాధిత యువకుడు తాగి అల్లర్లు చేయడం వల్లే అతడిని కొట్టినట్టు పోలీసులు చెబుతున్నారు. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ‘ఈ పోలీసులు ఆ వ్యక్తిని ఎంత దారుణంగా కొడుతున్నారో. చూస్తుంటే ఒళ్లు జలదరిస్తోంది. ఈ పోలీసులను వెంటనే జైలులో పెట్టాలి’ అని ఓ యూజర్ కామెంట్ చేశాడు. దేశవ్యాప్త  లాక్‌డౌన్ కొనసాగుతున్న తరుణంలో ఈ వీడియో బయటకు రావడం కలకలం రేపుతోంది. కాగా, మధ్యప్రదేశ్‌లో ఇప్పటివరకు 6,000 మందికి పైగా కరోనా వైరస్ సోకిగా, 270 మంది కరోనాతో మృతిచెందారు. ఇక దేశవ్యాప్తంగా 1.25 లక్షలకు పైగా కరోనా బారిన పడగా.. 3,700 మందికి పైగా మరణించారు.