కేటీఆర్‌ వ్యాఖ్యలపై.. ఏపీ మంత్రులు ఫైర్ - MicTv.in - Telugu News
mictv telugu

కేటీఆర్‌ వ్యాఖ్యలపై.. ఏపీ మంత్రులు ఫైర్

April 29, 2022

కేటీఆర్ ఆంధ్రప్రదేశ్‌‌పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఏపీ విద్యాశాఖ మంత్రి, ఇంధ‌న శాఖ మంత్రి తీవ్రంగా మండిపడ్డారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో కరెంట్, నీళ్లు లేవుని,  రోడ్లన్నీ ధ్వంసమయ్యాయని అక్కడ పరిస్థితి అధ్వానంగా ఉందని తనకు చెప్పార’ని కేటీఆర్ శుక్రవారం ఓ సమావేశంలో అన్నారు.

దీనిపై ఏపీ నేతలు భగ్గుమన్నారు. బొత్స స‌త్య‌నారాయ‌ణ స్పందిస్తూ.. “ఏపీ గురించి కేటీఆర్‌కు ఎవ‌రో స్నేహితుడు ఫోన్ చేశాడేమో. ఆయనెవరో చెప్పారు, నేను తెలంగాణలో స్వయంగా అనుభవించాను. నిన్న‌టి వ‌ర‌కు హైద‌రాబాద్‌లోనే ఉన్నా. క‌రెంట్ లేక జ‌న‌రేట‌ర్ మీద ఉండాల్సి వ‌చ్చింది. ఇది నేనెవ‌రితోనూ చెప్ప‌లేదు క‌దా. కేటీఆర్ మాట‌ల‌ను నేను ఆక్షేపిస్తున్నాను. బాధ్య‌త క‌లిగిన స్థాయిలో ఉండి అలా మాట్లాడ‌కూడ‌దు. మీ ద‌గ్గ‌ర జ‌రిగిన అభివృద్ధి ఏమిటో చెప్పుకోవ‌చ్చు. కానీ, ప‌క్క రాష్ట్రాల‌ను విమ‌ర్శించ‌వ‌ద్దు. కేటీఆర్ త‌న వ్యాఖ్య‌ల‌ను వెనక్కు తీసుకోవాలి” అని ఆయన అన్నారు.

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందిస్తూ, “తెలంగాణలో సింగ‌రేణి బొగ్గు గ‌నులు ఉన్నాయి. అందుకే తెలంగాణ‌లో క‌రెంట్ కోత‌లు లేవు. ఏపీలో కూడా విద్యుత్ కోత‌లు లేవు. రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోస‌మే కేటీఆర్ వ్యాఖ్య‌లు. బొగ్గును ఎక్కువ‌ ధ‌ర‌కు కొన‌డానికైనా సిద్ధం. పంచాయ‌తీరాజ్‌లోనే 10 వేల కిలోమీట‌ర్ల‌కు పైగా రోడ్లు నిర్మించాం. తెలంగాణ‌లో త్వ‌ర‌లో ఎన్నిక‌లు రానున్నాయి. ఎవ‌రో ఒక‌ర్ని కించ‌ప‌రిస్తే ఓట్లు ప‌డ‌తాయ‌ని కేటీఆర్ ఏపీని విమర్శించారు” అని ఆయ‌న అన్నారు.