జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) రిపబ్లిక్ డే సందర్భంగా రెచ్చిపోయారు. ఏపీ సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఏపీ ప్రభుత్వాన్ని మళ్లీ విడగొట్టాలని ప్రయత్నిస్తున్నారని.. అలాంటి కుట్రకు ఎవరైనా పాల్పడితే తోలు తీస్తానన్నారు. ఏపీలో కుల పిచ్చి ఉందని చెబుతూనే.. మా కులమే అని , సీఎం మా వాడని ఓటు వేస్తే ఎలా అని ప్రశ్నించారు. రిపబ్లిక్ డే(Republic Day) వేడుకల సందర్భంగా మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేక రాష్ట్రాలు కావాలంటూ ఇటీవల కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ఈ సందర్భంగా పవన్ నిప్పులు చెరిగారు.
‘‘రిపబ్లిక్ డే రోజున చెప్తున్నా.. మళ్లీ ఏపీని విడగొట్టాలని సొంత రాష్ట్ర నేతలు ఎక్కువ గా మాట్లాడితే నాలాంటి తీవ్రవాదిని ఇంకోసారి చూడరు. విసిగిపోయాం.. మీ బతుకులకు రాజ్యాంగం తెలుసు? కానిస్టిట్యూషన్ అసెంబ్లీ డిబేట్స్(Assembly Debates) చదివారా? అవినీతిలో మునిగిపోయిన.. పబ్లిక్ పాలసీ తెలియని మీరు రాష్ట్రాన్ని విడగొట్టేస్తారా? మేం చూస్తూ కూర్చొంటామా? మేం దేశ భక్తులం.. ఏపీని ఇంకోసారి విడగొడతామంటే తోలు తీసి కింద కూర్చోబెడతాం. తమాషాలుగా ఉందా? సన్నాసులతో విసిగిపోయాం. ఎంతమంది ముఖ్యమంత్రులు రాయలసీమ నుంచి వచ్చారు? ఆ ప్రాంతానికేం చేశారు? అక్కడ నుంచి వలసలు ఎందుకు ఆపలేకపోయారు? ఉత్తరాంధ్ర రాష్ట్రం కావాలా? వైజాగ్ స్టీల్‌ప్లాంట్(Vizag Steel Plant) కోసం తెలంగాణకు చెందిన జగిత్యాలలో సాయిరెడ్డి చనిపోయారు.. గుంటూరులో హబీబుల్లా మస్తాన్ మరణించారు. ఆ సంగతి మీకు తెలుసా? మీ స్వార్థం కోసం ఇష్టారాజ్యంగా స్టేట్మెంట్లు ఇవ్వొద్దు. చాలు.. రాష్ట్రాన్ని, ప్రజల్ని విడగొట్టింది చాలు.. ఇక ఆపేయండి’’ అని పవన్ వ్యాఖ్యానించారు.