రాష్ట్రంలో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. బుధవారం ఉదయం నుంచి హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 40 ప్రాంతాల్లో ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. క్రిస్టియన్ మిషనరీలతో పాటు పలు సంస్థల్లో తనిఖీలు చేస్తోన్నారు. హైదరాబాద్‌లోని అల్వాల్, బొల్లారం, కీసర, జీడిమెట్ల, పటాన్‌చెరు, సికింద్రాబాద్‌లో ఐటీ దాడులు జరుగుతోన్నాయి.
అలాగే మెదక్, వరంగల్‌లో పలుచోట్ల ఐటీ సోదాలు జరుగుతోన్నాయి. అన్ని ప్రాంతాల్లో ఉదయం నుంచి ఏకకాలంలో పలు సంస్థలు, కార్యాలయాల్లో దాడులు చేపడుతోన్నారు. బాలవికాస సంస్థలో కూడా ఐటీ తనిఖీలు జరుగుతున్నాయి. ఈ సంస్థకు డైరెక్టర్లుగా సురేష్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి ఏలేటి, సురేష్ రెడ్డి సింగిరెడ్డి ఉన్నట్లు సమాచారం. 2016లో బాలవికాస సంస్థ ప్రారంభమైంది. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌లో ఎన్‌జీవోగా బాల వికాస్ రిజిస్టర్ అయ్యింది.
ఈ ఐటీ దాడులకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా.. ఇటీవలి కాలంలో ఐటీ శాఖ హైదరాబాద్ కేంద్రంగా ఐటీ దాడులను ముమ్మరం చేసింది. పలు సంస్థలపై దాడులు నిర్వహిస్తోంది. కొద్ది రోజుల క్రితమే గూగి కంపెనీపై ఐటీ దాడులు నిర్వహించారు. రాష్ట్రంలో మరో కొద్దినెలల్లో ఎన్నికలు జరగనున్న తరుణంలో వరుస ఐటీ దాడులు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.