ఉత్తరప్రదేశ్‌లో రక్షణ కారిడర్ నిర్మాణం జోరుగా సాగుతుంది. భారత్ ఏరోస్పేస్, రక్షణ విభాగాల కోసం విదేశీ సరఫరాదారులపై ఆధారపడడం తగ్గించేందుకు దీనిని అందుబాటులోకి తీసుకువస్తున్నారు. మొత్తం రూ.3,700 కోట్లతో రక్షణ కారిడర్ నిర్మాణం జరుగుతోంది. దీనికి సంబంధించిన పనులు 2018 ఆగస్టులో ప్రారంభమయ్యాయి. తాజాగా రక్షణ కారిడర్ నిర్మాణంపై సీఎం యోగి ఆదిత్యానాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రక్షణ కారిడర్ అందుబాటులోకి వస్తే పాక్ గుండెల్లో వణుకు పుట్టడం ఖాయమని చెప్పారు. అక్కడ తయారు చేసిన ఫిరంగులు గర్జించడం మొదలు పెడితే పాక్ ప్రపంచ పటం నుంచి కనపడకుండా పోతుందని అన్నారు. బుందేల్ ఖండ్ రీజియన్ లోని బాందాలో నిర్వహించిన కలింజార్ మహోత్స ప్రారంభ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. బుందేల్ ఖండ్ రీజియన్ అభివృద్ధి చేసేందుకు బుందేల్ ఖండ్ ఎక్స్‌ప్రెస్ హైవేను నిర్మించినట్లు యోగి గుర్తు చేశారు. దీంతో చిత్రకూట్ -ఢిల్లీ మధ్య ప్రయాణ సమయం 5:30 గంటలకు తగ్గిందని వెల్లడించారు. చిత్రకూట్‌లో త్వరలో ఎయిర్ పోర్ట్ కూడా నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు.