దేశీయ టెక్ దిగ్గజం టీసీఎస్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే ఆర్ధిక సంవత్సరంలో లక్షన్నర ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఈవో రాజేశ్ గోపీనాథన్ వెల్లడించారు. గతేడాది మార్చితో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో 1.03 లక్షల మందిని తీసుకున్నామని తెలిపారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో ఇప్పటికే 55 వేల మందిని తీసుకున్నామని, ఇందులో ఫ్రెషర్ల సంఖ్య 43 వేలు అని వివరించారు. ఇక డిసెంబర్ త్రైమాసికం వరకు సంస్థలో ఉన్న మొత్తం ఉద్యోగుల సంఖ్య 6 లక్షల 13 వేల 974 అని గోపీనాథన్ స్పష్టం చేశారు. ఇక సంస్థ ఆదాయం డిసెంబర్ త్రైమాసికం ముగిసేవరకు రూ. 10 వేల 846 కోట్లకు చేరిందని, కానీ లాభాలు మాత్రం విశ్లేషకుల అంచనాలు అందుకోలేదని పేర్కొన్నారు. అమెరికాలో మాంద్యం భయాలు ఏర్పడడమే ఇందుకు కారణమని తేల్చి చెప్పారు. వార్షిక ఫలితాలను పరిగణనలోకి తీసుకొని షేరుకు రూ. 67 చొప్పున డివిడెండుతో పాటు రూ. 8 చొప్పున మధ్యంతర డెవిడెంటును సిఫారసు చేశామని తెలిపారు. ఆర్డర్ల విషయానికి వస్తే డిసెంబర్ త్రైమాసికంలో 7.6 బిలియన్ డాలర్ల విలువైన ఆర్డర్లు సంపాదించామని, తొలి రెండు త్రైమాసికాల్లో వరుసగా 8 బిలియన్ డాలర్ల ఆర్డర్లు పొందగలిగామని వివరించారు.