One country - one uniform.. Prime Minister Modi's new call
mictv telugu

ఒకే దేశం – ఒకటే యూనిఫాం.. ప్రధాని మోదీ నయా పిలుపు

October 28, 2022

ఒకే దేశం – ఒకటే పోలీస్ యూనిఫాంపై చర్చించాలని ప్రధాని మోదీ రాష్ట్రాలకు పిలుపునిచ్చారు. శాంతి భద్రతల అంశం రాష్ట్రాల చేతుల్లోనే ఉన్నా.. దీని సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసి అమలు చేయాలని సూచించారు. దేశ సమైక్యత, అఖండతలతో దీనికి సంబంధం ఉంటుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రాల హోంమంత్రులతో హర్యానాలో జరుగుతున్న మేథోమథనం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాని శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా నేరాలు, వాటి అదుపు గురించి పలు సూచనలు చేశారు. నేరాలు రాష్ట్ర, దేశ సరిహద్దులు దాటుతున్నాయని, సరిహద్దు అవతల నుంచి టెక్నాలజీ వినియోగించి నేరాలు చేస్తున్నారన్నారు. రాష్ట్ర, కేంద్ర దర్యాప్తు సంస్థలు సమన్వయంతో పని చేసి వీటిని అరికట్టాల్సిన అవసరం ఉందని నొక్కి వక్కాణించారు. కాగా, రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో పోలీసు దళాల ఆధునికీకరణ, సైబర్ క్రైమ్ మేనేజ్‌మెంట్, క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ఐటీ వాడకం, భూ సరిహద్దుల నిర్వహణ, తీర ప్రాంత భద్రత, మహిళల రక్షణ, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా తదితర అంశాలపై చర్చించనున్నారు. హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశాల్లో ఎనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 16 రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రులు, హోం మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.