అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ పెద్దముత్తయిదువ కళతో మరింతగా ప్రకాశించింది. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు భక్తులు ఈ రోజు కోటి గాజులు కానుకగా సమర్పించుకున్నారు. తమ మాంగల్య సౌభాగ్యాన్ని కాపాడాలని కోరుకున్నారు. గాజుల కళతో అమ్మవారు మెరిసిపోయారు.
ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన వెంకట సీతారామాంజనేయ షణ్ముఖ మహిళా సమాజం, శ్రీ కైవల్యాకృతి సేవా సంఘం, శివ దత్త క్షేత్రం కలసికట్టుగా ఈ కోటి గాజులను అమ్మవారి విగ్రహం ఊరేగింపుతోపాటు ఆలయానికి తీసుకొచ్చాయి. తర్వాత ఈవో కోటేశ్వరమ్మకు బుధవారం అందజేశారు. 350 మందికిపైగా మహిళలు ఈ గాజులను 16 మినీ వ్యానుల్లో ఊరేగింపుగా ఇంద్రకీలాద్రికి తీసుకొచ్చారు. అమ్మవారికి త్వరలో జరిగే గాజుల అలంకరణకు వీటిని వినియోగిస్తామని, తర్వాత ప్రసాదంగా తిరిగి మహిళలకు పంపిణీ చేస్తామని ఆలయ అధికారులు చెప్పారు.