అమెరికాలో వరుస కాల్పుల ఘటన కలకలం రేపుతున్నాయి. మొన్న మిచిగావ్ స్టేట్ యూనివర్సిటీలో ఓ అగంతకుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించిన విషయం తెలిసిందే. తాజాగా టెక్సాస్ లోని సీలో విస్టా షాపింగ్ మాల్ లో బుధవారం కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒకరు మరణించారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. కాల్పులకు తెగబడిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. మరో నిందితుడికి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే మాల్ లో ఎంతమంది కాల్పులకు తెగబడ్డారన్న విషయంపై స్పష్టత లేదన్నారు. ఎందుకు కాల్పులు చేశారన్న కోణంలో సమగ్రంగా దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
మాల్లోకి ప్రవేశించిన దుండగులు విచక్షణారహితంగా కాల్పలు జరపడటంతో భయాందోళనకు గురైన ప్రజలు పరుగులు తీశారు. కాగా కాల్పుల్లో గాయపడిన ముగ్గురిని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసు అధికార ప్రతినిధి రాబర్ట్ గోమెజ్ తెలిపారు.మాల్ లోని ఫుడ్ కోర్టు,డిల్లార్డ్స్ డిపార్ట్ మెంట్ స్టోర్ లో కాల్పులు జరిగినట్లు స్థానిక నివేదికలు తెలిపాయి. కాగా ఇదే మాల్ లో 2019లో జరిగిన జాత్యహంకార దాడిలో 23మంది మరణించారు. నిత్యం రద్దీగా ఉండే షాపింగ్ ప్రాంతం కావడంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అయినా కూడా కాల్పులను అడ్డుకోలేకపోతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.