సైన్యం ఖాతాలో మరో విజయం.. హిజ్బుల్ ఉగ్రవాది హతం - MicTv.in - Telugu News
mictv telugu

సైన్యం ఖాతాలో మరో విజయం.. హిజ్బుల్ ఉగ్రవాది హతం

May 17, 2020

terrorist

హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన తాహిర్ అహ్మద్ భట్ అనే ఉగ్రవాదిని భద్రతా దళాలు మట్టుబెట్టాయి. దోడా జిల్లా ఖోత్రా గ్రామంలో సైన్యం, జమ్మూకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా  ఆపరేషన్‌ నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో తాహిర్‌ను అంతమొందించి భద్రతా బలగాలు మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్నాయి. ఐదు గంటల పాటు ఈ ఆపరేషన్ కొనసాగింది. ఈ ఏడాది జనవరి నుంచి తాహిర్ కోసం వేట మొదలుపెట్టామని జమ్మూకశ్మీర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ముఖేశ్ సింగ్ వెల్లడించారు. ఉగ్రవాది హరూన్‌ హతమయ్యాక దాడులతో పాటు హిజ్బుల్ కార్యకలాపాలు తాహిర్‌ కనుసన్నల్లో జరిగాయని తెలిపారు. ఘటనా స్థలం నుంచి పెద్ద ఎత్తున మందుగుండు సామాగ్రిని, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. కాగా, జమ్మూకశ్మీర్‌లో ఈ ఏడాది 70 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. ఇటీవలే హిాజ్బుల్ కమాండర్ రియాజ్ నైకూను సైన్యం హతమార్చిన విషయం తెలిసిందే.