శ్రీలంక కాల్పుల్లో ఒకరి మృతి.. అధికారాలను తగ్గిస్తాం : ప్రధాని - MicTv.in - Telugu News
mictv telugu

శ్రీలంక కాల్పుల్లో ఒకరి మృతి.. అధికారాలను తగ్గిస్తాం : ప్రధాని

April 20, 2022

తీవ్ర ఆర్ధిక, ఆహార సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. అధ్యక్షుడు గొటాబయ రాజపక్స పదవి నుంచి దిగిపోవాలంటూ నినాదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో రంబుక్కనా నగరంలో రాజధాని కొలంబోకు వెళ్లే రహదారిపై ఆందోళనకారులు టైర్లకు నిప్పు పెట్టి రోడ్డును బ్లాక్ చేశారు. వారిని చెదరగొట్టడానికి పోలీసులు కాల్పులు జరిపారు. అయితే రబ్బరు బుల్లెట్లు కాకుండా నిజమైన బుల్లెట్లు వాడడంతో కాల్పుల్లో ఒకరు చనిపోగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కాగా నిన్న శ్రీలంకలో పెట్రోల్ ధర లీటరుకి రూ. 84 పెరిగి రూ. 338కి చేరింది. దీంతో రేషన్ పద్ధతిన చమురును పంపిణీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు దిగిపోవాలనే ప్రజల డిమాండును దృష్టిలో ఉంచుకొని ప్రధాని స్పందించారు. అధ్యక్షుడి అధికారాల్లో కోత పెట్టి పార్లమెంటుకు మరిన్ని అధికారాలు కల్పిస్తామని ప్రకటించారు.