ఒక్కరోజులో అత్యధిక పబ్బులకు వెళ్లి ఎక్కువ మద్యం తాగి గిన్నీస్ రికార్డు సాధించాడు ఓ వ్యక్తి. తద్వారా అంతకు ముందున్న రికార్డును అధిగమించి చరిత్ర సృష్టించాడు. యూకేలో భాగమైన వేల్స్ దేశానికి చెందిన గారేత్ మర్ఫీ అనే వ్యక్తి 24 గంటల్లో 56 పబ్బులకు వెళ్లి మద్యం తాగాడు. అందుకు సాక్ష్యంగా ఆయా పబ్బులలో తను హాజరయిందీ, ఎంత తాగిందీ రికార్డు చేయించాడు. ఇంతకు ముందు ఈ రికార్డు ఇంగ్లండుకి చెందిన మట్ ఎల్లిస్ పేరిట ఉండేది. ఆయన 2021లో 51 పబ్బులకు వెళ్లి రికార్డు నమోదు చేయగా, తాజాగా అది బద్దలైంది.
అయితే రికార్డు కోసం పబ్బులకు వెళ్లిన గారేత్ మర్ఫీ మద్యం తాగనవసరం లేనప్పటికీ మద్యం అమ్మే పబ్బులకే వెళ్లాడు. మొత్తంగా రోజులో దాదాపు 10 లీటర్ల వరకు జ్యూసులు, బీర్లు, స్థానికంగా దొరికే ఎనర్జీ డ్రింకులను తాగాడు. అయితే ఇన్ని పబ్బులకు వెళ్లాలంటే సమయం సరిపోతుందా? అనే అనుమానం మీకు వచ్చి ఉంటుంది. దీనికి మర్ఫీ ఎంచుకున్న ప్లేసు చూస్తే ఔరా అనాల్సిందే. దేశంలోని కార్డిఫ్ అనే ప్రాంతంలో కేవలం అర చదరపు కిలోమీటరు పరిధిలో దాదాపు 300 పబ్బులున్నాయి. దీంతో పని ఈజీగా అయిపోయింది. గతంలో కూడా మర్ఫీ ఈ రికార్డు కోసం ప్రయత్నించగా, చాలా సార్లు ఫెయిలయ్యాడు. తాజాగా దానిని సాధించడంతో సంతోషంతో ఉప్పొంగిపోతున్నాడు. గిన్నీస్ వారు ఇచ్చిన పత్రాన్ని చూపిస్తూ గర్వంగా ఫీలవుతున్నాడు.