భారతదేశంలో కిరాణా సరుకులు 10 నిమిషాల్లో డెలివరీ అవుతాయి. కానీ అత్యవసరమైన అంబులెన్స్ సేవలకు మాత్రం 45 నిమిషాలు పడుతుంది. ఈ సమయాన్ని తగ్గించేందుకు ఒక కంపెనీ అంబులెన్స్ సేవలను మొదలు పెట్టింది. స్టాన్ ప్లస్ సంస్థను ప్రభదీప్ సింగ్ మొదలు పెట్టారు. దీనికి సహ వ్యవస్థాపకులుగా.. ఆంటోయిన్ పోర్సన్, జోస్ లియోన్లు ఉన్నారు. వీరందరూ కలిసి 15 నిమిషాల్లో అంబులెన్స్ సేవలను అందించే ఆరోగ్య సాంకేతిక సంస్థను ప్రారంభించారు. ఈ నెట్ వర్క్ ప్రముఖ ఐదు నగరాల్లో ఈ సేవలను అందిస్తున్నది.
అత్యవసర సేవలు..
స్టాన్ ప్లస్.. ఎండ్ టు ఎండ్ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్ నెట్ వర్క్ ను నిర్ధారిస్తుంది. ఇది సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ నుంచి టెలిఫోనీ సిస్టమ్స్, అంబులెన్స్, డ్రైవర్స్, పారామెడిక్స్ వరకు ప్రతిదానిని పరిష్కరించే పూర్తి స్టాక్ వైద్య సహాయం అందించే వెంచర్ గా ప్రారంభించారు. 24 గంటల అంబులెన్స్ సేవలతో పాటు, 900 అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ ను కూడా నిర్వహిస్తారు. ఇక్కడ పారామెడిక్స్ 360 డిగ్రీ ఎమర్జెన్సీ కేర్ సర్వీస్ కూడా అందిస్తారు. హెల్త్ టెక్ కంపెనీ ఆరు సెకన్లలోపు అత్యవసర కాల్ లను పికప్ చేస్తుంది. నాలుగు నిమిషాల లోపు అంబులెన్స్ ను రోడ్డు పైకి తీసుకు వస్తుందని పేర్కొంది.
మరిన్ని ఆసుపత్రులు..
ఈ కంపెనీ.. హైదరాబాద్, బెంగళూరు, కోయంబత్తూర్, భువనేశ్వర్, విశాఖపట్నం అంతటా అంబులెన్స్ సేవలను అందిస్తున్నది. ఈ సంస్థ ఇప్పటికీ 50 ఆసుపత్రులతో భాగస్వామ్యం కలిగి ఉంది. అయితే రాబోయే 18 నెలల్లో దీనిని 15 నగరాల్లో 500 ఆసుపత్రులకు తీసుకెళ్లే ఆలోచనలో ఉందీ సంస్థ. స్టాన్ ప్లస్ తాము ఆపరేటింగ్ సిస్టమ్ ను రూపొందిస్తున్నామని.. వైద్యపరమైన అత్యవసర పరిస్థితిలో రోగులు లేదా ప్రియమైన వారిని నేరుగా లేదా వారి బీమా కంపనీ, యజమాని, కుటుంబ వైద్యుడు లేదా ఆసుపత్రి ద్వారా సంప్రదించవచ్చని చెప్పారు. 15 నిమిషాల నుంచి ఎనిమిది నిమిషాలకు సమయాన్ని తగ్గించడానికి ఈ బృందం ఇప్పటికే 20 మిలియన్ డాలర్లను సేకరించింది. త్వరలోనే తక్కువ సమయంలో అంబులెన్స్ సేవలను అందుకోవచ్చు. ఈ అంబులెన్స్ సేవల కోసం.. అత్యవసర హెల్ప్ లైన్ 1800 121 911 911 లేదా www.redambulances.com వెబ్ సైట్ ని క్లిక్ చేయవచ్చు.