రేపు మోదీ ప్రసంగంలో ఇదే కీలకం.. వన్ నేషన్.. వన్.. - MicTv.in - Telugu News
mictv telugu

రేపు మోదీ ప్రసంగంలో ఇదే కీలకం.. వన్ నేషన్.. వన్..

August 14, 2020

'One Nation One Health Card' to be reality soon, PM Modi likely to make announcement on August 15.

శనివారం ఎర్రకోట వేదికగా జరగనున్న పంద్రాగస్ట్ (74వ స్వాతంత్య్ర దినోత్సవం) వేడుకల సందర్భంగా ప్రధాని మోదీ ఓ కీలక ప్రకటన చేయనున్నారు. మోదీ తన ప్రసంగంలో ‘ఒక దేశం – ఒక ఆరోగ్య కార్డు’ పథకాన్ని ప్రకటించనున్నట్టు సమాచారం. దేశవ్యాప్తంగా ప్రతి పౌరుడి ఆరోగ్య రికార్డులను డిజిటల్‌ రూపంలో భద్రపరిచడమే ఈ పథకం లక్ష్యంగా కేంద్రం ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఈ ఆరోగ్య కార్డు పథకంలో వ్యక్తికి జరిగిన చికిత్సలు, పరీక్షలు సహా వైద్య సమాచారం అంతా డిజిటలీకరించి ఈ కార్డులో పొందుపరుస్తారు. ఆసుపత్రులు, క్లినిక్‌లు, వైద్యులను కేంద్ర సర్వర్‌తో అనుసంధానిస్తారు. దేశంలో వైద్యారోగ్య పరిస్ధితిని పూర్తిగా మార్చేందుకు ఉద్దేశించిన ఈ పధకంలో పౌరుల వ్యక్తిగత సమాచారం భద్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటారు. ఈ పథకాన్ని ఆపై మందుల షాపులు, వైద్య బీమా కంపెనీలకూ సర్వర్‌లో అనుసంధానం చేస్తారు. అయితే ఈ పథకాన్ని ఉపయోగించుకోవాలా లేదా అనే నిర్ణయాన్ని పూర్తిగా ఆసుపత్రులు, పౌరులకే నిర్ణయానికే వదిలివేయనున్నారు. ఈ కార్డును కోరుకున్నవారికి ఓ యూనిక్‌ ఐడీని కేటాయిస్తారు. 

ఆ ఐడీతో వారు సిస్టమ్‌లోకి లాగిన్‌ అవుతారు. దశలవారీగా అమలు చేసే ఈ పథకానికి రూ.300 కోట్ల బడ్జెట్‌‌‌ను కేంద్రం కేటాయించింది. దేశంలోని వైద్యుడు, ఆసుపత్రిని సందర్శించే వ్యక్తి తన వెంట వైద్య పరీక్షల రిపోర్టులు, ప్రిస్క్రిప్షన్లు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉండకపోవడం ఈ పథకంలో అధిక ప్రయోజనాన్ని కలిగించే అంశం అంటున్నారు. యూనిక్‌ ఐడీ కొట్టగానే రోగికి సంబంధించిన పూర్తి వివరాలు, రికార్డులు దర్శనం ఇస్తాయి. తదనుగుణంగా వైద్యులు రోగిని పరిశీలిస్తారు. ఆధార్‌ కార్డు తరహాలోనే ఈ హెల్త్‌ కార్డును జారీ చేస్తారు.