కలపాలని నన్ను బలవంతం చేస్తున్నారు.. పవన్
జనసేన విలీనం వ్యవహారంపై పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పార్టీని విలీనం చేయాలంటూ ఒక పెద్ద పార్టీ తనపై ఒత్తిడి తెస్తోందని ఆరోపించారు. విజయవాడలోని జనసేన కార్యాలయంలో ఆయన పార్లమెంట్ పరిధిలో నేతలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘జనసేనను తమ పార్టీలో కలపాలని ఓ జాతీయ పార్టీ నాపై ఒత్తిడి తీసుకువస్తోంది. కానీ, నాకు ఆ ఆలోచనే లేదు. జాతి సమగ్రతను కాపాడటానికి, మానవతా విలువల కోసం పెట్టిన పార్టీ జనసేన. అందుకే జనసేనను ఏ పార్టీలోనూ కలపను. నేను సత్యం కోసం పనిచేసేవాడిని. నా బలం ఏంటో.. నా బలహీనత ఏంటో నాకు తెలుసు’ అని పవన్ స్పష్టం చేశారు. ఆ జాతీయ పార్టీ ఏదనేది పవన్ చెప్పకపోవడం గమనార్హం.
అనంతరం ఆయన కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి మాట్లాడారు. ఎవరికైనా అభిప్రాయాలు ఉంటే చెప్పాలని.. అలా కాకుండా రోడ్డు మీదకు వెళ్లి, సోషల్ మీడియాలో చెప్తే వినటానికి ఇదేం కాంగ్రెస్ పార్టీ కాదు అని విమర్శించారు. జనసైనికులు అంతా వరదబాధితులను ఆదుకోవాలని పిలుపునిచ్చారు. ఇదే సమయంలో అభిమానులు పవన్‌తో ఫోటోలు దిగడానికి అత్యుత్సాహం ప్రదర్శించారు. ఈ క్రమంలో ఆయన స్పందిస్తూ.. ‘అభిమానులతో కలిసి ఫోటోలు దిగటానికి ఇబ్బందేమీ లేదు. అయితే అందరూ ఒకేసారి మీద పడిపోవడం వల్ల కొంచెం ఇబ్బందిగా వుంది’ అని అన్నారు.