రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలై ఏడాది గడిచింది ఈరోజుతో. మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుందో లేదో తెలియదు కానీ ఈ రెండు దేశాల మధ్యా వార్ మాత్రం ప్రపంచాన్ని ఒక కదుపు కుదిపేసింది. ఈ యుద్ధం మొత్తం ప్రపంచం మీద ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రభావం మాత్రం చూపించింది.
ఎప్పుడేమవుతుందో
ఏడాది కావస్తున్న యుద్ధం మాత్రం ఇంకా ముగియలేదు. రష్యా బలగాలను ఉక్రెయిన్ సమర్ధవంతంగానే అడ్డుకుంటోంది. తమ శక్తికి మించి ఉక్రెయిన్ పోరాడుతోంది. యుద్ధం వద్దని చాలా దేశాలు చెబుతూనే ఉన్నాయి. అయినా కూడా రష్యా మాత్రం యుద్ధం ఆపేదే లేదు అంటోంది. తెల్లవారకముందే..ఎరుపు రంగుతో, బాంబుల శబ్దంతో నిద్రలేచిన ఉక్రెయిన్ ప్రజల దుస్థితి ఇప్పటికీ అలానే ఉంది. ఎప్పుడు ఎవరూ వచ్చి మీద పడతారో తెలియదు. ఎటు నుంచి ఏ బాంబు వచ్చి పడుతుందో తెలియదు. అక్కడి ప్రజల జీవితాలు గాల్లో దీపాల్లా వేలాడుతున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న నిర్విరామ భీకర దాడుల్లో వేలాది మంది మరణిస్తున్నారు. భీకర బాంబుల వర్షంలో ఉక్రెయిన్ నగరాలు తడిసి ముద్దవుతున్న సమయంలో ఇప్పుడిప్పుడే ఈ యుద్ధం ముగిసేలా కనిపించడం లేదు.
యుద్ధమంటే విధ్వంసమే, విషాదమే ఎప్పుడైనా. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు ఇరు దేశాలు కూడా అధికారికి లెక్కలు చెప్పనప్పటికీ.. కేవలం మరణించిన సైనికుల సంఖ్యే 3లక్షలు దాటి ఉంటుందని అంచనా. అటు యుద్ధం కారణంగా పెట్టేబెడా సర్ధుకుని పొరుగు దేశాలు వెళ్ళిపోయిన వారి సంఖ్యా లక్షల్లోనే ఉంది. మరోవైపు యుద్ధం కారణంగా దెబ్బతిన్న ఉక్రెయిన్ మళ్ళీ పూర్వస్థితికి రావాలంటేఅయ్యే ఖర్చు రూ.29 లక్షల కోట్లు అని ఒక అంచనా. అటు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యుద్ధం అనేక నష్టాలను మిగిల్చింది. అసలే కరోనా కష్టాల్లో మునిగివున్న ప్రపంచం, అగ్రరాజ్యాలు తమ ఆధిపత్యం కోసం, ఆర్థిక ప్రయోజనాల కోసం చేసే యుద్ధాలను భరించగలిగే స్థితిలో లేదు. అందుకే యుద్ధం ఆపాలంటూ అటు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను, ఇటు ఉక్రెయిన్ అధ్యక్షుడు పుతిన్‌ను ప్రపంచదేశాధినేతలు మొరపెట్టుకుంటున్నారు. ప్రస్తుతం నడుస్తున్న ఆర్ధిక మాంద్యం లాంటి పరిస్థితులు కూడా ఒకరకంగా యుద్ధమే కారణం.
ఆగేదెప్పుడు?
బాంబుల మోతతో దద్దరిల్లుతున్న ఉక్రెయిన్-రష్యా పరిణామాలు ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి. అసలు ఈ యుద్ధం ఆగేదెప్పుడో ఎవరికి అర్థమవ్వడంలేదు. యుద్ధం వెనుక ఎవరున్నారో, ఎవరి ప్రయోజనాల కోసం వార్ చేస్తున్నారో తెలియదు కానీ బలైపోతున్నది మాత్రం ఉక్రెయిన్ ప్రజలే. క్రిమియా తరహాలో ఉక్రెయిన్‌ను ఆక్రమించుకోవాలన్నది పుతిన్ ఆలోచన. అదే ప్లాన్‌తో మొదట 2లక్షల మంది సైన్యంతో బరిలోకి దిగారు.. ఇప్పుడా సంఖ్య 5లక్షలు దాటింది.. అయినా ఉక్రెయిన్ ప్రతిఘటనను ఎదుర్కొలేకపోతోంది రష్యా. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నంతో విడిపోయిన ఉక్రెయిన్ ఎప్పటికైనా తనదేననీ, తనతోనే ఉండాలనీ పుతిన్ కోరుకుంటున్నారు. అనేక కీలకమైన రక్షణరంగ పరిశ్రమలు, క్షిపణి తయారీ వ్యవస్థలు, అపారఖనిజ సంపదతో వేరుపడిన ఉక్రెయిన్ రష్యాకు బంగారు బాతు. అందుకే పుతిన్ వెనక్కి తగ్గడంలేదు. అయితే ఉక్రెయిన్ కు చాలా దేశాల మద్దతు ఉంది. అమెరికా వటంి అగ్రరాజ్యాలు ఉక్రెయిన్ ను కాపాడుకుంటూ వస్తున్నాయి. ఇలా ఇద్దరిలో ఎవరూ తగ్గకపోవడంతో ఈ యుద్ధం ఇప్పుడప్పుడే ముగిసేలాగా కనిపించడలేదు.
ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించాలని, తక్షణమే తమ బలగాలను ఉపసంహరించుకోవాలని రష్యాను డిమాండ్ చేస్తూ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఈ తీర్మానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెజారిటీ దేశాలు ఆమోదం తెలిపాయి. మొత్తం 193 దేశాలున్న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో 141 సభ్యదేశాలు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశాయి. ఇక తీర్మానాన్ని 7 దేశాలు వ్యతిరేకించగా, 32 దేశాలు అసలు సమావేశానికే హాజరు కాలేదు. ఇదిలా ఉంటే గతంలో నిర్వహించిన తీర్మానంలో అనుసరించిన విధంగానే మరోసారి భారత్ ప్రదర్శించింది. భారత్ ఓటింగ్ కు గైర్హాజరు అయింది. చైనా కూడా ఓటింగ్ కు దూరంగా ఉంది. ఇలా రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై యూఎన్ నిర్వహించిన తీర్మానంలో భారత్, చైనా ఒకే నిర్ణయం తీసుకున్నాయి. ఇక చర్చలు, దౌత్యమార్గాల ద్వారా ఉక్రెయిన్, రష్యాలు సమస్యలను పరిష్కరించుకోవాలని మొదటి నుంచి భారత్ చెబుతోంది.
ఐక్యరాజ్య సమితి చార్టర్ సూత్రాలకు అనుగుణంగా ఉక్రెయిన్ లో సమగ్రమైన, న్యాయమైన, శాశ్వతమైన శాంతిని నెలకొల్పాలని తాజాగా ప్రవేశపెట్టిన తీర్మానంలో చెప్పింది. దీనికోసం దౌత్యపరమైన ప్రయత్నాలు ఎక్కువ చేయాలని సభ్యదేశాలు, అంతర్జాతీయ సంస్థలకు పిలుపునిచ్చింది.
ఏం బావుకుంది?
ఈ యుద్ధం వల్ల రష్యా కూడా బావుకున్నది ఏమీ లేదు. ఉక్రెయిన్ చేతిలో అవమానకర దెబ్బలు కూడా చవిచూసింది. అంతేకాదు రష్యా ఆర్ధిక వ్యవస్థ కూడా చాలా దెబ్బతింది. అమెరికా, మరికొన్ని దేశాలు ఆంక్షలు పెట్టడంతో పూర్తిగా కుదేలయిపోయే పరిస్థితికి చేరుకుంది. అంతర్జాతీయ సంస్థలన్నీ దేశాన్ని వీడాయి. చమురు ఒక్కటే అక్కడ నుంచి ఎగుమతి, దిగుమతి అవుతోంది. దీంతో ద్రవ్యోల్బణం చుక్కలు చూపిస్తోంది. రష్యా నుంచి కూడా చాలా మంది ఇతర దేశాలకు వలస వెళ్ళిపోతున్నారు. యుద్ధం మీద బాహాటంగానే వ్యతిరేకత చూపిస్తున్నారు. ఒకపక్క అరెస్ట్ లు జరుగుతున్నా ఆందోళనలు చేస్తూనే ఉన్నారు.
మరోవైపు అమెరికా, బ్రిటన్ 30 నాటో సభ్య దేశాలు ఉక్రెయిన్ కు పూర్తిగా మద్దతునిస్తున్నాయి. మొన్న బైడెన్ సడెన్ విజిట్ ఇందుకు నిదర్శనం. ఈ దేశాలన్నీ ఆయుధ, ఆర్ధిక సహాయం భారీగా చేస్తున్నాయి.