వన్‌ప్లస్ యూజర్లకు షాక్.. డేటా లీకైంది..  - MicTv.in - Telugu News
mictv telugu

వన్‌ప్లస్ యూజర్లకు షాక్.. డేటా లీకైంది.. 

November 23, 2019

OnePlus Discloses Data Breach, Says Some Customers’ Personal Information ‘May Have Been Exposed’.

తమ వినియోగదారుల వ్యక్తిగత డేటా, ఇతర సమాచారం లీక్‌ అయిందంటూ చైనా మొబైల్‌ సంస్థ వన్‌ప్లస్‌ షాకిచ్చింది. కస్టమర్ల  డేటా ‘అనధికార పార్టీ’ ద్వారా లీకైందని తెలిపింది. దీంతో అప్రమత్తమైన వన్‌ప్లస్ తన వినియోగదారులను మేలుకొలిపే పనిలో పడింది. హ్యాకర్లు చాలా తెలివిగా వన్‌ప్లస్‌ కస్టమర్ల ఆర్డర్ల ద్వారా వారి వ్యక్తిగత వివరాలను తస్కరించారని చెప్పింది. కస్టమర్ల పేర్లు, ఫోన్ నంబర్లు, ఈ మెయిల్‌, చిరునామా వంటి వివరాలు ఉన్నాయని పేర్కొంది. అయితే, పాస్‌వర్డ్‌లు, ఆర్థిక వివరాలు భద్రంగా ఉన్నాయని  హామీ ఇచ్చింది. దీనిపై తమ వినియోగదారులను అప్రమత్తం చేయాలనే ఉద్దేశంతోనే ఈ సమాచారాన్ని అందిస్తున్నామని తెలిపింది. 

ఈ డేటా బ్రీచ్‌ మూలంగా కొంతమందికి స్పామ్‌ మెసేజ్‌లు, నకిలీ ఈమెయిల్స్‌ రావచ్చని, జాగ్రత్త వహించాలని సూచించింది.  గత వారమే డేటా లీక్‌ విషయాన్ని గ్రహించామని, వెంటనే చర్యలు తీసుకున్నామని స్పష్టం చేసింది. అంతేకాదు సంస్థ నుంచి అధికారిక ఈ మెయిల్ రాకపోతే, సంబంధిత వినియోగదారుని ఆర్డర్ సమాచారం సురక్షితం అని వన్‌ప్లస్‌ వివరించింది. దీనిపై మరింత దర్యాప్తు కోసం సంబంధిత అధికారులతో కలిసి పనిచేస్తున్నామని  వన్‌ప్లస్‌ సెక్యూరిటీ టీం ప్రతినిధి జీవ్‌  సీ ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, డేటా ఉల్లంఘనతో ఎంతమంది ప్రభావితం అయ్యారనేది కంపెనీ స్పష్టంగా ప్రకటించలేదు.