రోడ్డుపై ఉల్లి వర్షం..ఎగబడి ఏరుకున్న జనం  - MicTv.in - Telugu News
mictv telugu

రోడ్డుపై ఉల్లి వర్షం..ఎగబడి ఏరుకున్న జనం 

December 13, 2019

Onion Loot0000

ఉల్లి కటకటతో బాధపడుతున్నవారికి సిరుల పంట కురిసింది. రోడ్డుపై పెద్ద ఎత్తున ఉల్లిపడిపోయి కనిపించడంతో స్థానికులు ఎగబడ్డారు. అసలే ఉల్లి కొరతతో అల్లాడుతున్న ప్రజలు దొరికిందే తడువుగా అందిన కాడికి పోగుచేసుకొని ఇంటికి తీసుకెళ్లారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ జిల్లా గొండల్ హైవేపై ఇది జరిగింది. ఎక్కడ చూసినా ఉల్లి కొరతే ఉన్న సమయంలో ఫ్రీగా కనిపించిన ఉల్లి కోసం ప్రజలు రోడ్లపై పరుగులు తీయడం వైరల్‌గా మారింది. 

ఇంతకీ ఇంత పెద్ద ఎత్తున ఉల్లిపాయలు ఎక్కడి నుంచి వచ్చిపడ్డాయని అనుకుంటున్నారా. గురువారం ఉదయం ఓ ట్రాక్టర్ ఉల్లిపాయల లోడుతో గోండల్ హైవే‌ నుంచి వెళ్తోంది. ఆ సమయంలో ట్రాక్టర్‌ ప్రమాదానికి గురై బోల్తా పడింది. దీంతో ఉల్లిపాయలు అన్ని రోడ్డుపై పడిపోవడంతో ఈ వార్త చుట్టపక్కల వారికి తెలిసింది. వెంటనే అక్కడికి చేరుకున్న స్థానికులు దొరికినకాడికి ఉల్లి పోగు చేసుకొని సంచుల్లో తీసుకెళ్లారు. దీంతో రోడ్డుపై కొంతసేపు వాహనాలరాకపోకలకు ఇబ్బందిగా మారింది.