రూ. 20 లక్షల ఉల్లి చోరీ... - MicTv.in - Telugu News
mictv telugu

రూ. 20 లక్షల ఉల్లి చోరీ…

November 29, 2019

దొంగలు రూటు మార్చినట్టున్నారు. నగదు, బంగారం, వజ్రాలతో పాటు ఉల్లిని కూడా టార్గెట్ చేస్తున్నారు. ఉల్లి ధరలు గణనీయంగా పెరగడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. కొన్ని రోజుల బెంగాల్ రాష్ట్రంలోని ఓ కూరగాయల దుకాణంలో దోపిడీ చేసిన దొంగలు గల్లా పెట్టెను వదిలేసి ఉల్లిపాయలను మాత్రమే ఎత్తుకెళ్లారు. తాజాగా..మహారాష్ట్రలోని నాసిక్ నుంచి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్‌పూర్ నగరానికి వెళ్తున్న ఉల్లిగడ్డల లారీని మార్గమధ్యలో చోరీ చేశారు.

లారీలో నుంచి దొంగలు ఉల్లిగడ్డలను మాత్రమే చోరీ చేసి ఖాళీ లారీని వదిలేశారు. నాసిక్ నగరానికి చెందిన ప్రేమ్‌చంద్ శుక్లా అనే వ్యాపారి శివపురికి చెందిన జావేద్ అనే యజమాని లారీలో రూ.20 లక్షల ఉల్లిగడ్డలను మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్‌పూర్‌కు పంపించారు. ఉల్లిగడ్డల లారీ గమ్యస్థానానికి చేరక పోవడంతో వ్యాపారి ప్రేమ్‌చంద్ శుక్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేయగా లారీతో పాటు డ్రైవరు కూడా అదృశ్యమయ్యాడు. తరువాత మరింత దర్యాప్తు చేయగా ఖాళీ లారీ మాత్రం దొరికిందని, కానీ అందులో ఉన్న రూ.20 లక్షల విలువైన ఉల్లిగడ్డలు మాత్రం లేవని శివపురి జిల్లా ఎస్పీ రాజేష్ సింగ్ తెలిపారు.