మరింత ఘాటెక్కిన ఉల్లి ధర.. - MicTv.in - Telugu News
mictv telugu

మరింత ఘాటెక్కిన ఉల్లి ధర..

November 17, 2019

onion .

ఉల్లి ధర రోజురోజుకీ ఘాటు ఎక్కుతోంది. ఢిల్లీలో దీని ప్రభావం ఎక్కువగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా పరిస్థితి దారుణంగా ఉంది. బహిరంగ మార్కెట్లో కర్నూలు ఉల్లిపాయలు కూడా రూ.60 నుంచి రూ.70లకు అమ్ముడవుతుండడంతో వినియోగదారులు తల్లడిల్లిపోతున్నారు. మహారాష్ట్ర ఉల్లిపాయల సరఫరా పూర్తిగా తగ్గిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లో పండే ఉల్లి పంటలో 95 శాతం కర్నూలు జిల్లా నుంచే వస్తుంది. ఈ జిల్లాలో దాదాపు 88 వేల ఎకరాల్లో ఉల్లి పంట పండిస్తారు. మిగిలిన ఐదు శాతం ఇతర జిల్లాల్లో అక్కడక్కడా పండిస్తారు. అలాగే మహారాష్ట్రలోని నాసిక్‌లోను భారీగా ఉల్లి పండిస్తారు. 

తెలుగు రాష్ట్రాల్లోని మార్కెట్లకు ఎక్కువగా సరఫరా అయ్యేది ఈ రెండు ప్రాంతాల నుంచే. మామూలు రోజుల్లో ఈ రెండు రకాల ఉల్లిపాయల మధ్య 10 నుంచి 20 శాతం ధర తేడా ఉంటుంది. వర్షాల కారణంగా రెండు చోట్లా ఉల్లి దిగుబడి గణనీయంగా తగ్గిపోవడంతో ఆ ప్రభావం ధరపై కనిపిస్తోంది. మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం ఈ ఏడాది కర్నూలు ఉల్లి దిగుబడులు 40 నుంచి 50 శాతానికి పడిపోయాయి. డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవడంతో ఆ ప్రభావం ధరపై పడింది. అధిక ధరను దృష్టిలో పెట్టుకుని ఏపీ ప్రభుత్వం రైతు బజార్ల ద్వారా రూ.25లకే కిలో ఉల్లిని సబ్సిడీపై సరఫరా చేస్తున్నా వినియోగదారులకు అది అంతగా ఊరట నివ్వడం లేదు.